పుట:Narayana Rao Novel.djvu/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

99

గౌతమి

హనరావును శారదయు దగ్గరగా గూర్చుండి మాట్లాడుకొనుచుండిరి. శారద కిలకిల నవ్వుచుండెను. జగన్మోహనరావు మోము దరహాస ప్రఫుల్లమైయున్నది. వీరు లోన నడుగిడగనే శారద త్వరితముగ లేచి లోనికి జివ్వున పారిపోయినది. జగన్మోహనరావు మోమున గ్రోధచ్ఛాయ లించుక పొలసి తొలగిపోయినవి. శారద లేచిపోవుట ముందువచ్చిన జమీందారుగారికి నారాయణరావుకు మాత్రమే కనబడెను. జమీందారు గారి హృదయమునం దొకవిధమగు జుగుప్స జనించెను. మెరుపువలె మెరసి మాయమయిన శారదా బాలిక నారాయణరావు గుండియలో బాటపాడినది.

శారదపై నారాయణరాయని ప్రేమ నానాటికి గట్టలొరసి యఖండ గౌతమివలె పొరలిపోవుచున్నది. అత డందు మునకలిడుచు దేలియాడుచున్నాడు. వెడదలై, అర్థనిమీలితములగు శారదానయనము లాతని గలంచి వైచుచున్నవి. ఇతని ఇరువది రెండేండ్ల వయసు ముమ్మరము సలసల వెరలియాడుచున్నది.

వయసులోనున్న స్త్రీ, పురుషుల కొండొరులపై జనించు నీ వలపున కర్థమేమో? చిన్నతనమున నొకచో బెరిగి యాటలాడుకొను బాలికా బాలకులకు మాత్రము ప్రేమలేదా? అవ్యక్తమధురము, సరళము నగు నా ప్రేమకూడ వియోగమును సహింపదు. ఆ బాలికా బాలకు లిర్వురు నెపుడు గలసియుండగోరుదురు. ఒండొరులు భుజములపై చేతులిడుకొని తిరుగుచుందురు. ఆ యాట పాటలందే, ఒకరినొకరు ‘ఏమోయి’ యని నోరార బిలుచుకొనుటయందే వారికి దృప్తి. వారికి బరస్పర సౌందర్యముతో బనిలేదు. వారిరువురకు యౌవనోదయ మగుటతోడనే ఆ స్నేహము వలపుగా బరిణమించుటేలనో ? వారి పల్కులు, చూపులు, చేతలుగూడ నూత్నవికారమును బొంది క్రొత్తతలపులు రేకెత్తించు టేలనో ? అట్టి చిన్ననాటి మిత్రుల యౌవన మొండొరుల యందు వివాహముచే జరితార్థము కానినాడు వారి జీవితములు దుఃఖభాజనము లైపోవుట వినుచుందుము.

అవ్యాజమధురమగు నా చిననాటి స్వచ్ఛ ప్రేమమే తారుణ్యోదయమున కామావతార మెత్తనేల? ప్రాణిధర్మమగు నీ కామమునకుదోడు సౌందర్య లాలస యేటికో? అట్లని సుందరియగు ప్రతియువతిని ప్రతిపురుషుడును కామించునా? రతీచ్ఛవినా దేహసంశ్లేష మాత్రమున దృప్తిచెందు కామముండునా? తా నింతకుము న్నెందరు సౌందర్యవతులను గాంచియుండలేదు? అట్టి వారెల్ల తన హృదయమును జూరగొనరై రేల? ప్రథమదర్శనమాత్రముననే శారదపై దనకు జనించినది ప్రేమమా, కామమా? అపరిచితయు, నజ్ఞాతయౌవనయు నగు నీ శారద తనకు భార్యయైనంతమాత్రమున తన దేహ మనఃప్రాణము లామెకై యిట్లు తహ తహ జెందనేల? దీనిని జననాంతర సౌహృద మందునా? లేక దాంపత్యమే యనవలయునా? నా యీ చిన్న శారదయు నేనును జన్మజన్మ