పుట:Narayana Rao Novel.djvu/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గౌతమి

101

‘కుడి బొటనవ్రేలికి గోణము తగిలించుకొంటాను. ఎడమచేతివేళ్లు నొక్కులుపడ్డాయి’యని యాబాల వామహస్తము భర్తకు జూపించినది. అతడా పాణిని గ్రహించి ‘హృదయవచశ్శరీరముల సౌందర్యాన్ని బలియిస్తే కాని ఆనందాన్ని సృష్టించలేము కాదూ? ఎన్ని గంటులో! పాపము, ఈ చిన్న వేళ్ళకు ఎంత శ్రమో’ యని యామె చేయి తన పెదవులతో నల్లన స్పృశించి కన్నుల కద్దుకొనెను.

శారద యపరిమిత త్రపామూర్తియై చేయి లాగికొని, చిరునవ్వు మోమును రాగరంజితము చేయ, మెరపువలె నా మేడమీద నింకొక గదిలోనికి మాయమైనది.

నారాయణరావు హర్ష ప్రఫుల్లములగు నయనములతో దన చిన్నారి భార్య పోయిన దెస చూచుచుండెను.

ఇంతలో జమీందారు గారు లోనికివచ్చి యాలోచనామగ్నుడైయున్న యల్లుని వీపుపై చేయి నిడెను. నారాయణరావు ఉలికిపడి తలయెత్తి మామగారిని జూచి, చివాలున లేచెను. ‘కూర్చోవోయి! నీ స్నేహితులంతా నీకోసం కాబోలు చూస్తున్నారు. మా జగన్మోహనుణ్ణి ఆడిస్తునట్లున్నారు. అతడో వెఱ్ఱివాడు. గర్వి. దుష్టహృదయం కలవాడు. నీవు ఎఫ్. ఎల్. లో మొదటివాడవుగా మొదటితరగతిలో నెగ్గినందుకు నాకు చాలా సంతోషంఅయింది. నువ్వు వెళ్లేటప్పుడే నేనూ చెన్నపట్టణం వస్తాను. నువ్వు హాస్టలులోవుండడం మానివేసి కీల్ పాకులో నా బంగాళావుంది అందులోనే ఉండు. అద్దెకున్న వారిని ఖాళీ చేయవలసిందని వ్రాశాను. వారున్నూ రేపు జూలై నెలలో వెడుతున్నారు. నీ యిష్టంవచ్చిన కారొకటి చూడు. మా దివానుగా రదికొని, నీకు ఇస్తారు. ‘చ్యాపుయరు’ (మోటారునడుపువాడు) నొకణ్ణి చూచి ఉంచారు. ఆకారు నీకు బహుమతి.’

‘నేనే ఒక చిన్నరకం కారు కొనుక్కోడానికి ఏర్పాటులు చేసుకున్నానండి.’

‘నా ముచ్చటకు నువ్వు అడ్డం చెప్పవద్దు.’

‘చిత్తం.’

‘శారదా!’

పక్కగదిలోనున్న శారద ‘ఎందుకు నాన్నగారూ?’ అని పలికినది.

‘ఈలా రా అమ్మా!’

శారద గుమ్మము కడకు వచ్చినది.

‘కొంచెముసేపు క్రిందికివచ్చి వీణ వాయిస్తావా? నీ సంగీతగదిలో నే కూచో.’

‘ఇపుడు వాయించలేనండి.’

‘పోనీలే.’