పుట:Naa Kalam - Naa Galam.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నోబెల్‌ కమిటీ తన నిజాయితీని, నిక్కచ్చి తనాన్ని ప్రశ్నించడానికి వీలైన అవివేక సమాధాన మిచ్చింది!

భారత రాష్ట్రపతికి ఫ్రాన్స్‌లో అవమానం

శ్రీ కె.ఆర్‌. నారాయణన్‌ రాష్ట్రపతిగా వున్నప్పుడు ఆయన అధికార పూర్వకంగా ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లారు. ఆయన అక్కడకు చేరిన మరునాడు ఫ్రెంచి అధ్యక్షుని మర్యాదకోసం కలుసుకోవలసివుంది. పారిస్‌లో "లె మాండ్‌" అనే ప్రముఖ దినపత్రిక - బహుశా నూరు సంవత్సరాలకు పైగా వెలువడుతున్నది. అది ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచి దినపత్రిక.

ఆ పత్రిక "యాన్‌ అన్‌ టచబుల్‌ ప్రెసిడెంట్‌ ఫ్రమ్‌ ఇండియా మీట్స్‌ అవర్‌ ప్రెసిడెంట్‌ టు డే" ("భారతీయ "దళిత" అధ్యక్షుడు నేడు మన అధ్యక్షునితో సమావేశం") అన్న శీర్షికతో ఒక వార్త ప్రచురించింది. ఇది నిస్సందేహంగా భారత రాష్ట్రపతికి అవమానకరమైన సంబోధన. ఆ పత్రికకు భారత విదేశాంగ శాఖ అక్కడి విదేశాంగ శాఖ ద్వారా ఇందుకు నిరసన తెలియజేసింది.

ఈ వార్త ఇక్కడి పత్రికలలో ప్రచురితం కాగానే నేను ఆ పత్రికకు ఘాటుగా ఒక లేఖ రాశాను. కేవలం దళితుడన్న కారణాన శ్రీ నారాయణన్‌ను భారత రాష్ట్రపతిగా ఎన్నుకోలేదని, ఆయన జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి దౌత్య ప్రతినిధిగా, కేంద్రంలో మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా, చివరికి రాష్ట్రపతి పదవి ఆయనను వరించిందని, ఆయన అత్యున్నత చరిత్రను సృష్టించుకున్న మహా మేధావి అని పేర్కొన్నాను.

అంతేకాక, స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న మహదాశయాలకు ప్రాణం పోసిన "లె మాండ్‌" ఇలాంటి రాతలు రాయడం ఆశ్చర్యకరమని పేర్కొంటూ, భారతదేశంలో అస్పృశ్యతను భారత రాజ్యాంగం