పుట:Naa Kalam - Naa Galam.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిషేధించిందని, ఏ భారతీయ పత్రిక అయినా ఒక దేశాధినేతను కించపరిచే ఇలాంటి పద ప్రయోగం చేస్తే, భారత ప్రభుత్వం చర్య తీసుకుంటుందని ఆ లేఖలో పేర్కొంటూ, నా లేఖను ప్రచురించాలని సవాల్‌ చేశాను. ఉత్తమ పత్రికా సంప్రదాయాలను పాటించే "లెమాండ్‌" నా లేఖను యథాతథంగా ప్రకటించిందట. ఆ లేఖ కటింగ్‌ను పారిస్‌లోని భారత రాయబారి కార్యాలయం వారు రాష్ట్రపతి కె.ఆర్‌. నారాయణన్‌కు పంపించారు.

ఆ తరువాత కొంత కాలానికి సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయానికి కొన్ని రోజులపాటు దక్షిణ భారతంలో గడపడానికి వచ్చిన రాష్ట్రపతి నారాయణన్‌ కార్యాలయం నుంచి ఒక రోజు మధ్యాహ్నం నాకు ఫోన్‌ వచ్చింది.

"రాష్ట్రపతిని రేపు కాని, ఎల్లుండి కాని ఉదయం 11 గంటలకు కలుసుకొనడం మీకు వీలవుతుందా?" అని రాష్ట్రపతి కార్యాలయాధికారి ప్రశ్నించే సరికి నాకు ఆశ్చర్యం కలిగింది! ఎందుకు? ఏమై వుంటుంది?

"నేను ఎల్లుండి సంతోషంగా కలుస్తా"నని సమాధానమిచ్చాను. ఆ మరునాడే హైదరాబాద్‌ చేరుకోవాలంటే కొన్ని యిబ్బందులున్నాయి. అందువల్ల, "ఎల్లుండి" అని చెప్పాను.

ఆ "ఎల్లుండి" రోజున ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో శ్రీ కె.ఆర్‌. నారాయణన్‌ను కలుసుకున్నాను. ఆయన సాదరంగా పలకరించి, "లెమాండ్‌"తో నా ఉత్తర ప్రత్యుత్తరాలను గురించి ప్రస్తావించి, నాకు ధన్యవాదాలు చెప్పేసరికి నాకు ఆశ్చర్యం, ఆనందం కలిగాయి! అంతేకాక, "ఆంధ్రకేసరి" టంగుటూరి ప్రకాశంపై డాక్యుమెంటరీ తీస్తున్నామని చెప్పి, భారత ప్రభుత్వం నా వద్ద వున్న ప్రకాశం గారి ఫొటోలు, ఉత్తరాలను సేకరించిందని, కాని ఏళ్లా పూళ్లా గడిచినా ఏమీ కాలేదని, నేను తనకు రాసిన లేఖ విషయం ప్రస్తావించగా, ఆ విషయంలో తాను