పుట:Naa Kalam - Naa Galam.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధికి వరుసకు మేనత్త షీలా కౌల్‌ సిఫారసుతో ఆయన ముఖ్యమంత్రి అయినారని ప్రతీతి! నేను ప్రధానిని కలుసుకునే నాటికి ఆయన ముఖ్య మంత్రిత్వంలోకి వచ్చి మూడు నెలలే. ఆ తరువాత నాలుగు నెలలకు ఆయన ఉద్వాసన! ఆయన తరువాత మూడు మాసాల ముచ్చటగా శ్రీ కోట్ల విజయ భాస్కరరెడ్డి! 1983 జనవరి 6వ తేదీన జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో జన్మించిన తొమ్మిది నెలలకే టి.డి.పి.కి మూడింట రెండు వంతుల మెజారిటీతో అఖండ విజయం లభించింది!

భగ్నమయ్యే రాజీవ్‌ సభ!

భీమవరంలో శ్రీ రాజీవ్‌గాంధి ఉపన్యాసాన్ని నేను తెలుగులోకి తర్జుమా చేస్తున్నప్పటి ఫొటోను శ్రీమతి ఇందిరా గాంధికి యిచ్చినట్టు ఇంతకు పూర్వమే పేర్కొన్నాను. అది 1982 ఫిబ్రవరి. పశ్చిమ గోదావరిజిల్లా భీమవరంలో అప్పటి నర్సాపురం ఎమ్‌.పి. శ్రీ అల్లూరి సుభాష్‌ చంద్రబోస్‌ "రైతు - కూలీ మహాసభ" ఏర్పాటు చేశారు. శ్రీ బోసు అఖిల భారత కాంగ్రెసుకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు కుమారుడు. శ్రీ రాజు మొదట కమ్యూనిస్టు. తరువాత "క్విట్‌ ఇండియా" ఉద్యమం సందర్భంగా కాంగ్రెస్‌లో చేరి, శ్రీమతి ఇందిరాగాంధికి రాజకీయంగా అత్యంత సన్నిహితుడైనారు.

శ్రీ బోసు ఆ సభను భీమవరం డి.ఎన్‌.ఆర్‌. కళాశాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. శ్రీ రాజీవ్‌ ఉపన్యాసాన్ని ఎవరు తర్జుమా చేయాలి? అప్పటికి శ్రీ రాజీవ్‌ ఏ.ఐ.సి.సి. కార్యదర్శి. 1980 జూన్‌ 23వ తేదీన ఇందిరాగాంధి రెండవసారి ప్రధాని అయిన అయిదు నెలలకే ఆమె రెండవ కుమారుడు, కొద్దికాలంలోనే తన కొక చరిత్ర సృష్టించుకున్న ఎమ్‌.పి. శ్రీ సంజయ్ గాంధి విమాన ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం దురదృష్టం. ఆయన స్థానంలో ఇందిరాగాంధి పెద్ద కుమారుడు శ్రీ రాజీవ్‌గాంధి ఎమ్‌.పి.గా