పుట:Naa Kalam - Naa Galam.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యిచ్చాను. కనిపించీ కనిపించని చిరునవ్వుతో ఆమె ఆ ఫొటోను తీసుకుని, పరీక్షగా చూసి, ప్రక్కనే వున్న తన రాజకీయ కార్యదర్శి శ్రీ ఎమ్‌.ఎల్‌. ఫోతేదార్‌కు యిచ్చారు.

మొరార్జీ పై ఇందిరాగాంధి ఆగ్రహం

ఆ తరువాత, ఆమెను ఏదో సమస్యపై మాజీ ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ తీవ్రంగా విమర్శించగా, ఆయనను ఖండిస్తూ నేను రాసిన లేఖకు మొరార్జీ రాసిన జవాబును నేను శ్రీమతి గాంధికి చూపించబోగా, ఆమె చిరు కోపంతో "ఐ డోంట్‌ సీ యిట్‌" ("ఆ వుత్తరం నేను చూడను") అన్నారు! మొరార్జీ అంటే ఆమెకు ఎంత కోపం!

ఆ తరువాత తెలుగుదేశం ప్రస్తావన ఎత్తుకున్నాను. ఆమె వెంటనే ఆసక్తిగా, ఆతురతతో నా వైపు తేరిపార చూశారు. "శ్రీ ఎన్‌.టి.ఆర్‌.కు అపారమైన ప్రజాబలం వున్నది. అదంతా ఆయన పౌరాణిక, జానపద చిత్రాలలో హీరోగా నటించి సంపాదించిన గ్లామర్‌. ఆయన ప్రజలలోకి వచ్చి, "నా పార్టీకి ఓటెయ్యండి" అని అడిగితే, ఓట్ల వర్షమే కురవవచ్చు" అన్నాను.

ఆమె ఆసక్తిగా వింటున్నారు. "టి.డి.పి. ఏర్పడి, రెండు నెలలే. ఇంకా ప్రాంభ దశలోనే వుంది. ఎన్‌.టి.ఆర్‌. గ్లామర్‌ దానికి కొండంత బలం" అన్నాను. ఆమె తల పంకించారు. ఏదో గట్టి చర్య తీసుకోకపోతే, ఆయనను నిలవరించడం కష్టమే" అని ముగించాను. ఆమె తిరిగి చూశారు. నా వంక సాలోచనగా చూశారు.

అప్పటికే కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులను - చెన్నారెడ్డి, టి. ఆంజయ్యలను - మార్చి వేసింది. అప్పటికి ముఖ్యమంత్రిత్వంలో భవనం వెంకట్రామ్‌ వున్నారు. ఆయన బహు బలహీన ముఖ్యమంత్రి. ఇందిరా