పుట:Naa Kalam - Naa Galam.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రశ్న "కాంగ్రెస్‌ గెలిచిందా?" అని! ఈ విషయాన్ని ఆ వూరిలో చాలాకాలం వరకు వింతగా చెప్పుకునేవారు! "ఆయనకు ఎంత జాతీయ స్ఫూర్తి!" అని!

నా పై ముగ్గురు మహనీయుల ప్రభావం పడింది. ఆ ప్రభావమే నా వ్యక్తిత్వాన్ని రూపొందించింది. గాంధీజీ, నెహ్రూజీ, "ఆంధ్రకేసరి" ప్రకాశం. అయితే, ఆచార్య ఎన్‌.జి. రంగా కొన్ని విషయాలలో నన్ను ప్రభావితం చేశారు. ముఖ్యంగా ఎదుటి వారిని గౌరవించండంలోను, మహిళలను, ముఖ్యంగా భార్యను గౌరవించండంలోను! గాంధీజీ అహింస, సత్యనిరతి, నెహ్రూ భావుకత్వం, ప్రకాశం ధైర్య సాహస త్యాగ ప్రవృత్తి - నాపై ప్రభావం చూపాయి. అప్పటిలో ప్రకాశం గారిని పెద్ద గురువు అని, రంగాగారిని చిన్న గురువు అని అనేవాడిని.

బ్రిటిష్‌ మాజీ ప్రధాని, కరుడుకట్టిన భారత స్వాతంత్య్రోద్యమ వ్యతిరేకి విన్‌స్టన్‌ చర్చిల్‌ ఒకసారి కెనడలోని భారతీయ హై కమిషనర్‌తో మాట్లాడుతూ "మీ ప్రధాని నెహ్రూ ద్వేషాన్ని, అసూయను జయించాడు. ఇవి మహా పురుషుని లక్షణాలు. ఈ విషయంలో ఆయనకు నా అభినందనలు తెలియజేయండి" అన్నాడు.

ఆ విషయం ఎక్కడో చదివిన తరువాత నేను కూడా ఆ రెండు దుర్గుణాలను జయించాలన్న ఆసక్తి కలిగింది. ఆ విషయంలో నేను చాలా వరకు విజయం సాధించానని వినమ్రతకు భంగం లేకుండా చెప్పగలను!

నెహ్రూ వ్యక్తిత్వం నన్ను ఎంతో ఆకర్షించింది. ఆయనతో మాట్లాడాలనే తహ తహ కూడా ప్రారంభమైనది. 1952లో నవ భారత రాజ్యాంగం ప్రకారం జరిగిన మొదటి జనరల్‌ ఎన్నికల ముందు నేను ప్రధాని నెహ్రూకు లేఖ రాస్తూ ఆంధ్ర రాజకీయాలను గురించి ఒక జర్నలిస్టుగా ఆయనకు వివరించ గోరుతున్నానని, అందువల్ల నాకు అయిదు నిమిషాలు ఢిల్లీలో ఇంటర్‌వ్యూ ఇవ్వాలని రాశాను.