పుట:Naa Kalam - Naa Galam.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పటి జిల్లా బోర్డులు అంటే ఇప్పటి జిల్లా పరిషత్తులే. అప్పటిలో జస్టిస్‌ పార్టీకి, కాంగ్రెసుకు తీవ్రమైన పోటీ. జస్టిస్‌ పార్టీ బ్రిటిష్‌ ప్రభుత్వం అనుకూల పార్టీ. కాంగ్రెస్‌ బ్రిటిష్‌ సామ్రాజ్య వాద ప్రభుత్వాన్ని దేశం నుంచి వెడలనంపడానికి పోరాడుతున్న జాతీయ సంస్థ. అందువల్ల, నాకు కాంగ్రెస్‌ పట్లనే ఆసక్తి, అభిమానం. ఎవరో నా చేతికి కాంగ్రెస్‌ త్రివర్ణాంచిత జాతీయపతాకాన్ని ఇస్తే, నేను ఎన్నికల రోజున "కాంగ్రెస్‌కు జై, జస్టిస్‌కు తొయ్" అంటూ కేకలు వేస్తూ తిరుగుతున్నాను. ఇది పామర్రు గ్రామంలో మేము వున్నప్పటి మాట. నా కేకల సంగతి ఎక్కడో వున్న మా అన్న సుందరరామారావు గారికి ఎవరో చెప్పినట్టున్నారు. ఆయన నా దగ్గరకు వచ్చి "చెంప ఛెళ్ళు"మనిపించారు! గూబగుయ్యి మన్నది! "జస్టిస్‌ పార్టీకి తొయ్ అంటే ఎంత ప్రమాదమో తెలుసా? వాళ్లే అధికారంలోకి వస్తారు!" అని ఆయన అన్నారు. ఒక ప్రక్క చెంపదెబ్బకు కన్నీరు తిరుగుతున్నా, నేను కూడా రెట్టించిన ఉక్రోషంతో "జస్టిస్‌ పార్టీకి కాక, కాంగ్రెస్‌కు తొయ్ అనమంటావా? జస్టిస్‌ పార్టీ వాళ్లు దేశద్రోహులు. కాంగ్రెస్‌ వాళ్లు దేశభక్తులు!" అన్నాను. ఇంతలో అక్కడికి నలుగురూ చేరేసరికి మా అన్న గారు నన్ను తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు!

"కాంగ్రెసు గెలిచిందా?"

కాంగ్రెసు గాంధీజీ, నెహ్రూ, రాజెన్‌బాబు ప్రభృతుల నాయకత్వంలో దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేస్తున్నది. 1946లో మద్రాసు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడు గన్నవరంలో వున్న నేను కూడా ఓటర్లను చేర్పించడానికి కృషి చేశాను. ఎన్నికలకు ముందే నాకు తీవ్ర రుగ్మత చేసి, దాదాపు మూడు నెలలకు పైగా, మంచంలోను, "కోమా"లోను వున్నానని ఇది వరకే పేర్కొన్నాను. ఆ రుగ్మత తగ్గి నేను కళ్లు తెరవగానే వేసిన మొదటి