పుట:Naa Kalam - Naa Galam.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెరగలేదు. నేను నా 14వ యేట ప్రజాజీవితంలో అడుగిడినప్పుడు ఒకటే అనుకున్నాను. "ఇలాంటి వ్యక్తి అరుదుగాకాని ఉండ"డన్న పేరు తెచ్చుకోవాలన్నది నా లక్ష్యం. అది సాధించానని నాకు సంపూర్ణ సంతృప్తి.

నేను రాసే ప్రముఖుల జీవిత చరిత్రలలో ఇద్దరు, ముగ్గురికి "వీరికి పుట్టుమచ్చంత అవినీతి మచ్చకూడా లేద"ని రాశాను. నన్ను గురించి ఎవరైనా రాస్తే, ఆపద ప్రయోగం నాకు కూడా ఉపయోగించగల స్థాయిని సంపాదించాను. నేను మంచితనం తప్ప మరేమీ ఎరుగను. మంచిని పెంచడానికే నేను ఇన్ని దశాబ్దాలుగా కృషి చేశాను.

పూర్వజన్మ, పునర్జన్మ ఉన్నవో, లేవో నాకుతెలియదు. అవి వున్నా మనకు తెలియదు. పూర్వజన్మలో మీరెవ్వరు? చెప్పగలరా ? చెప్పలేరు. అలాగే స్వర్గ నరకాలు, పరలోకం ఉన్నయా ? ఎవరికి తెలుసు? ఎవరైనా ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోయి, ఆ లోకాలకు వెళ్లి, తిరిగివచ్చినవారు ఒక్కరైనా ఉన్నారా? ఒక్కరు, ఒక్కరు, ఒక్కరు కూడా రెండు వందల కోట్ల సంవత్సరాల మానవేతిహాసంలో కనిపించరు ! అయినప్పుడు, ఆ లోకాలను గురించి ఆలోచన దేనికి ? వున్నదీ, కనిపించేదీ, మనం అనుభవించేదీ ఈ లోకమే. మన మంచి చెడ్డల "జడ్జి" ఈలోకమే. ఇదే మన లోకం. మరోలోకం ఉన్నా, లేకపోయినా మనకొద్దు.

"మరల ఈ దారిని వస్తానో, రానో" !

అందువల్లనే, ఒక గజల్‌ నాకు ఎంతగానో నచ్చింది! "అందరినీ ప్రేమించు! అందరినీ పలకరించు! మరల ఈ దారిని వస్తానో, రానో!" రాము, రాబోము. ఈ మహత్తర మానవ జీవిత సందేశాన్ని పాటించమే మానవ జీవిత ప్రస్థానానికి సాఫల్యం.