పుట:Naa Kalam - Naa Galam.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాగా, గాంధీజీకి నా అయిదు రూపాయల బాకీ తీర్చడానికి 2012 జనవరి 22న నాకు అవకాశం లభించింది! ఆ రోజున నేను తెనాలిలోని గాంధి శాంతి సేవాశ్రమాన్ని అనుకోకుండా సందర్శించాను. అక్కడ పెద్ద గాంధీ విగ్రహం వున్నది. ఆ విగ్రహాన్ని చూడగానే నామదిలో ఏదో మెరుపు మెరిసింది! మహాత్మునికి నా బాకీ తీర్చడానికి ఇదే అవకాశం! వెంటనే 1946 నాటి నా బాకీ కథను అక్కడ వున్న పాత్రికేయులు, ప్రముఖులకు చెప్పి, వారి సమక్షంలో అయిదు రూపాయల బాకీకి వడ్డీని కలిపి, వంద రూపాయల నోటు పై నా సంతకంతో గాంధీ విగ్రహం చేతికి సమర్పించాను! ఈ వార్త జిల్లా అంతటా వ్యాపించింది! "65 సంవత్సరాల తరువాత వడ్డీతో సహా గాంధీజికి తుర్లపాటి తీర్చిన బాకీ" అంటూ పత్రికలలో వార్తా శీర్షిక ప్రత్యక్షమైనది!

నా జీవితంలో మహాత్మాగాంధి ఆటోగ్రాఫ్‌ సేకరించడం, నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను ఇంటర్‌వ్యూ చేయడం, "ఆంధ్ర కేసరి" టంగుటూరి ప్రకాశంగారికి కార్యదర్శిగా పనిచేయడం - అరుదైన మహత్తర అవకాశాలు!

అతిసామాన్యుడనైన నేను ఇవన్నీ సాధించడానికి ఆ భగవచ్ఛక్తి నాకు ప్రసాదించిన ఆయురారోగ్యాలే ప్రధాన కారణం ! మరి, దాదాపు ఏడు దశాబ్దాలు ప్రజా జీవితంలో అవిచ్ఛిన్నంగా, నిరంతర ప్రజల సాన్నిహిత్యంతో, ఇంతకాలం జోడుగుర్రాలవలె కలం, గళం పోటీపడి సాగడం నా వంటి సామాన్యుడికి సాధ్యమా?

నాకు వేరే ఆశలు లేవు, ఏమీకాని నాకు ఎన్నో లభించాయి! అన్నింటినిమించి నిరంతర అఖండప్రజాభిమానం నేను సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తి! ఈ ప్రజాభిమానం నాపట్ల ఏనాడూ తరగలేదు, కించిత్తు