పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

మీఁగడ తఱకలు

ఇబ్రహీంప్రభు విచ్చినయగ్రహారమును నిన్న మొన్నఁటి దాఁకఁ దద్వంశ్యులే యనుభవించుచుండిరి.

సుగ్రీవవిజయము రచించినరుద్రకవియే నిరంకుశోపాఖ్యాన మని గ్రంథాంతరము రచియించెను. రెండుగ్రంథములందును గర్తకు కందుకూరు జనార్దనభక్తత్వము, పెదలింగనార్యపుత్త్రత్వము గలదు గావున రెండు గ్రంథములు నొక్కనివే యగుట స్పష్టము. నిరంకుశోపాఖ్యానమున,

"చేరి కన్నడభూమి చెఱవట్టుపాశ్చాత్య
నృపతికైనను గొంతకృప దలిర్చు "

అని సీసచరణ మున్నది. అది విద్యానగరమును దురుష్కులు కొల్లఁ గొట్టినదుస్సందర్భమును దెలుపుచున్నది. విద్యానగర వినాశనము క్రీ.శ. 1568 నాఁడు జరగినది. కావున నిరంకుశోపాఖ్యానరచన మటుతరువాత జరగినదగును. అప్పకవీయమున వినుకొండలో గుంటుపల్లి భాస్కరయగారిసముఖమునఁ గందుకూరి రుద్రకవి కవితాచర్చ జరపినట్లు కలదు. మనరుద్రకవి యూతఁ డగునేమో! నిరంకుశోపాఖ్యాన సుగ్రీవవిజయకర్త క్రీ.శ. 1568 ప్రాంతములవాఁడేని, కొంతతర్వాతివాఁ డేని కాఁగలఁడు. దక్షిణదేశమం దల్పముగా నాంధ్రదేశమం దధికముగా యక్షగానముల రచనములు, ప్రయోగములు సాగుచుండిన కాల మది.

సుగ్రీవవిజయము

శ్రీమద్రామాయణమునఁ గలకథాఖండములలో సుగ్రీవవిజయకథ యొక కండపట్టు. అత్యల్పకాలమున వడివడిగా గంటలలో నడచిన యీకథపట్టు రామలక్ష్మణులు, హనుమంతుడు, సుగ్రీవుఁడు, వాలి, అంగదుఁడు, తార అనుకథాపాత్రముల శీలపు మేలిమి నొఱసి మెఱుఁగు తఱుగులు చూపినయొఱగ ల్లనఁదగినది.