పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/100

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

81

తెలుఁగున గుత్తెనదీవిరామాయణాదు లగురామాయణగేయ కృతులలో నీసుగ్రీవవిజయపుఁగథపట్టు చాల హృద్యరచనములతో నున్నది.

ఎంత పని చేసితివి రామా! నిన్ను
నేమ నందును సార్వభౌమా!
చెంత కిటు రాలేక చెట్లలో దాగుండి
వింతమృగమును గొట్టువిధ మాయెనా బ్రదుకు!

ఇత్యాదిగేయములను బలువురు పాడుచుందురు.

ఈరుద్రకవిసుగ్రీవవిజయమునుగూడ స్త్రీ, వృద్ధ, పామరాదులు పలువురు పాడుచుందు రఁట! ఆయాపాత్రముల పాటలు తత్తద్వేషధారులు వచ్చి పాడునట్లును దక్కినసంధివచనాదులు ఒక్కరిద్దఱు సూత్రధారప్రాయులు పఠించునట్లును నీసుగ్రీవ విజయము వీథియాటగా నాడఁబడుచుండెడిది. ప్రాచీన సంస్కృత నాటకరచయితలు భాసభవభూత్యాదు లీసుగ్రీవవిజ యౌచిత్యమును దమనాటకములలో విమర్శించిరి. శ్రీరాముని శీలమును శ్రీవాల్మీకిరామాయణపద్ధతిని సమర్ధించిరి.

భవభూతి "యద్వా కౌశల మింద్రసూనుదమనే తత్రాప్యభిజ్ఞోజనః" యని దీని యౌచిత్యము నించుక చెనకెను. మన రుద్రకవి సంస్కృతాంధ్ర రామాయణకవులు త్రొక్కినత్రోవనే త్రొక్కెను గాని యపూర్వకల్పనాంశము నేమాత్రము నిందుఁజేర్చలేదు,

ఆయాపాత్రములు ప్రసిద్ధరామాయణములలో నెట్టియుక్తిప్రత్యుక్తులు గలవిగాc జిత్రితము లయ్యెనో యిందు నదే తీరు గలదు. కాని యిది దేశిరచనముతో గేయరూపమున నుండుట విశేషము. ఇం దీక్రింది గేయరచనలు ప్రశస్తము లయినవి!