పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

59


లుప్తభాగముల నితరులు పూరించిరి. పోతరాజుగారికిఁదర్వాత నలువదియేcబదియేండ్లకే లభింపనియాభాగము లిప్పుడు లభించిన వనుటను ప్రత్యక్షముగా నాగ్రంథమును జూచినప్పడు కాని విశ్వసింపరాదు.

పోతరాజుగా రేకశిలానగర (ఓరుఁగల్లు) వాస్తవ్యులు. ఆకాలమున నానగరము విప్లవములపాలయి యుండెను. విద్యావినోదముల కప్పు డక్కడ వెరవులేదు. ఈకారణమునఁ గొన్నాళ్లదాఁక నాగ్రంథము నెవరుఁ దాఁకరయిరి. పరిశీలనము లేకపోవుటచేఁ గాఁబోలు నది కొంతశిథిల మయినది. రాజున కంకిత మిచ్చినచో నాతఁడు పదిప్రతులు వ్రాయించి పదువురచేఁ జదివించి వ్యాప్తికిఁ దెచ్చియుండెడివాఁడు. పోతరాజుగా రట్టు చేయరైరి సరిగదా మఱియు నట్టివారిని దిట్టిరి. సర్వజ్ఞసింగభూపతి కుపితుఁడై యాగ్రంథమును బూడ్పించినాఁ డనికూడఁ బ్రతీతి కలదు. కాని దాని మనము విశ్వసింపరాదు. ఆయన దానివ్యాప్తికిఁ దోడు పడకుండవచ్చును. పోతరాజుగారు క్రీ 1420 ప్రాంతములం దుండిరి. క్రీ 1490 ప్రాంతములందుఁ గల హరిభట్టు పోతరాజు గారిభాగవతమున లోపించినభాగములను (షష్ఠస్కంధము ఏకాదశద్వాదశస్కంధములు) పూరించినాఁడు. పోతరాజుగారిగ్రంథము సమగ్రముగా నాకాలమున లభించుచుండినచో నాతఁ డాస్కంధములఁ బూరింపఁ బూనఁడు. హరిభట్టుకాల మిప్పుడు మనకుఁ దెలిసినదిగాన యిట్లు చెప్పఁగలిగితిమి. వెలిగందలనారయ, ఏర్చూరిసింగన మొదలగువారికాలములు మన కెఱుఁగ రాలేదు. వారు హరిభట్టుకంటెఁగూడఁ బూర్వులుగా నుండ వచ్చునేమో! అప్పుడే లభింపనిపోతరాజుగారిరచన మిప్పుడు లభించె ననుట విశ్వాస్యముగా నాకుఁదోఁపదు. అయినను దొరకినపుస్తక మేదో నలుగురకన్నులకుఁ గానవచ్చు నేని యెట్లేని నిర్ణయ మేర్పడును. అదియుఁ గానరాకున్నది. వ్రాఁతప్రతులలో సామాన్యముగా నన్నిరచనములకుఁగూడఁ బోతరాజుగారిపేరే కానవచ్చును. అది బ్రాంతిజనకమై యుండవచ్చును.