పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/79

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

మీఁగడ తఱకలు


లుప్తభాగములఁ బూరించినవారు.

హరిభట్టు

పోతరాజుగారు భాగవతము నద్వైతసిద్ధాంతానుగుణముగా శ్రీధరవ్యాఖ్య ననుసరించి రచించిరి. హరిభట్టు విశిష్టాదైతసిద్ధాంతాను గుణముగా షష్ఠైకాదశద్వాదశస్కంధములఁ బూరించెను. హరిభట్టురచన మంత హృద్యమయినదిగాఁ దోఁపదు. తెలుఁగుభాగవతము వ్రాఁతప్రతులు పెక్కులు ఏర్చూరిసింగన షష్ఠస్కంధముతోను వెలిగందలనారయయేకాదశద్వాదశస్కంధములతోను నుండును. కాని యక్కడక్కడఁ గొన్ని ప్రతులలో హరిభట్టురచనములుకూడఁ గలసియున్నవి. అమృత ప్రవాహమువంటి పోతరాజుగారిరచనము నశించుటచేతఁ దత్తుల్యముగా లుప్తభాగములను బూరింపఁగోరి హరిభట్టువలెనే మటికొందఱుకూడ రచనముల నెఱపిరి. కాని యెవ్వరికిని దత్తుల్యరచనము పొసఁగలేదు. అట్టిభాగ్యము భారతకవులకే లభించినది. రామాయణమునఁగూడ నొక్కయయ్యలార్యురచనముమాత్రమే భాస్కరరచనముతో సరితూఁగఁ గల్గినది కాని తక్కినవి కొఱవడినవే.

ఏర్చూరి సింగన

భాగవతపూరణములలో నేర్పూరిసింగన షష్ఠస్కంధరచనము ప్రశస్త మయినది. అది కొంతవఱకుఁ బోతరాజుగారిరచనమును బోలుచున్నది. హరిభట్టుషష్ఠస్కంధరచనముకంటె నిదియెంతేని మేలితరముగా నున్నది. సింగనకాల మెఱుఁగరాదు. ఆతఁడుకూడఁ గృష్ణరాయలకుఁ బూర్వఁ డే కావచ్చును. కువలయాశ్వచరిత్ర మనుగ్రంథమునుగూడ నాతఁడు రచించెను. అది దొరకలేదు.