పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

33


వెంకటరమణయ్యగారు ప్రకటించిన తాళ్లప్రొద్దుటూరిశాసనము వేములవాడ భీమకవిరచనము కావచ్చు నని నాతలఁపు. ఏలనఁగా నందులో వేములవాడ భీమకవి పేరఁ బ్రసిద్ధి గన్న చాటుపద్య మిదికూడ గలదు.

ఉ|| పన్ని తురంగమంబునకుఁ బక్కెర వెట్టినవార్త చారుచే
     విన్నభయబునం గలఁగి వేసటనాఁటనె చక్ర(?) గోట్టముల్
     మన్నియపట్టణంబులును మక్కెన వేంగి కళింగ లాదిగా
     నిన్నియు నొక్కపె ట్టెగసె నేఱువభీమనృపాలుధాటికిన్ ||

మఱిన్నీ ఆ శాసనపుఁబద్యముల యనుకరణములుకూడ నాచన సోమనగ్రంథములో నున్నవి. పయి చాటుపద్యము లన్నింటిని బర్యాలోచింపఁగా భీమకవి క్రీ|| 12వ శతాబ్దిపూర్వార్ధమున ననఁగా నిప్పటి కెన్మిదివందల యేండ్లకు పూర్వ మున్నవాఁ డగును.

వేములవాడభీమకవి శాపానుగ్రహశక్తిమంతుఁ డనుటకుఁ దార్కాణముగాఁ బెక్కు చాటుధార లున్నవి. భీమకవి యొక్కప్పుడు గుడిమెట్ట యను గ్రామమున కరిగెనట! సాగిపోతురాజను రా జాతని గుఱ్ఱము నక్కడఁ దనసాహిణమునఁ గట్టి పెట్టించి యాతఁడు వేడినను విడిపింపఁ డయ్యెనఁట. దానిపైఁ గోపించి భీమకవి చెప్పినపద్యము.

చ|| హయ మది సీత, పోతవసుధాధిపుఁ డారయ రావణుండు, ని
     శ్చయముగ నేను రాఘపుఁడ, సహ్యజ వారిధి, మారుఁ డంజనా
     ప్రియతనయుండు లచ్చన, విభీషణుఁ డాగుడి మెట్టఁ లంక నా
     జయమును బోతరక్కసునిచావును నేడవనాఁడు చూడుcడీ!

కోమటివారిని నిందించినట్లు భీమకవిపద్యములు కొన్ని లక్షణ గ్రంథములం దుదాహరింపఁ బడియున్నవి. కవిజనాశ్రయమును కోమటిరేచన పేర రచించిన కవియే యిట్లు కోమటివారిని గర్హించునా యని సంశయము.