పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

95


క|| వాక్కాంతాశ్రయు భట్టరు
     చిక్కాచార్యుల మహాత్ము శ్రీగురుమూర్తిన్
     నిక్కపుభక్తి భజించెద
     నిక్కావ్యకళాకలాప మీడేఱుటకున్.

గద్యమున-ఇది శ్రీమత్పరమపదనాథనిరవధికకృపాపరి పాకపరిచితసరసకవితాసనాథ రామకృష్ణకవినాథ ప్రణీతం బైన-అని యున్నది.

రామలింగకవి రామకృష్ణకవి
కౌండిన్యగోత్రుఁడు కౌండిన్యగోత్రుఁడు
శుక్లయజుర్వేది శుక్లయజుర్వేది
తండ్రి - రామయ్య తండ్రి - రామయ్య
తల్లి - లక్ష్మమ్మ తల్లి - లక్ష్మమ్మ
కుమారభారతీబిరుదాభిరాముఁడు శా-రదనీరూపము రామకృష్ణ కవిచంద్రా !

ఉద్భటచరిత్రము బాల్యమున రచించినది గాన 'కుమార భారతి' యని బిరుదు చెప్పుకొన్నాఁడు. పాండురంగమాహాత్మ్యము ముదివయసున రచించినదిగాన 'శారదనీరూపము' అని కృతిపతి తన్ను సంబోధించినట్టు చెప్పకొన్నాడు, కాన యీభేదము సంగతమే. ఇన్ని సరిపడి యున్నను నుద్భటచరిత్రమున రామలింగయ యని గ్రంథకర్తపేరును పాలగుమి యేలేశ్వరుఁ డని గురునిపేరును, పాండురంగమాహాత్మ్యమున రామకృష్ణుఁ డని గ్రంథకర్తపేరును, భట్టరు చిక్కాచార్య లని గురునిపేరును గానవచ్చుట, గద్యములరీతులు భిన్నములుగా నుండుట, రెండు నొకనిపేళ్లే యనుసిద్ధాంతమునకుఁ గొంత బాధకముగాఁ గానవచ్చును. ఈభేదములు మతము మాఱుటచే నేర్పడినవే యని నే ననెదను.