పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

మీఁగడ తఱకలు

ఉద్భటారాధ్య చరిత్రమున రామలింగకవి స్వవిషయ మిట్లు తెల్పుకొన్నాఁడు

సీ|| కౌండిన్యమునిరాజమండలేశ్వరవంశపాథోధినవసుధాభానుమూర్తిఁ
      బాలగుమేలేశ పదపయోజద్వయీధ్యానధారణసముదాత్తచిత్తు
      మానితాయాతయామానామభావితవిపులమహాయజుర్వేదవేది
      రామేశ్వరస్వామిరమణీయకరుణావిశేషపోషితవిలసితసమగ్ర

గీ|| సహజసాహిత్య మాధురీసంయుతాత్ము
     లక్కమాంబకు ఘనయశోలక్ష్మి వెలయు
     రామధీమణికిని బుత్త్రు రామలింగ
     నామవిఖ్యాతుఁ గావ్యనిర్ణయధురీణు.

గద్యమునందును, "ఏలేశ్వర గురువరేణ్యచరణారవింద షట్చరణ సకలకలాభరణ రామనార్యసుపత్ర సుకవిజనమిత్ర కుమారభారతీబిరుదాభిరామ రామలింగయప్రణీత" మని యున్నది.

పాండురంగమాహాత్మ్యమున రామకృష్ణకవియిట్లు చెప్పుకొన్నాడు.

సీ|| ..........శైవవైష్ణవపురాణావళీనానార్ధ
     ములు నీకుఁ గరతలామలకనిభము

గీ|| లంధ్రభూమికుచాగ్రహారాభ మైన
     శ్రీ తెనాల్యగ్రహారనిర్ణేత వగ్ర
     శాఖికాకోకిలమ వీవు సరసకవివి
     రమ్యగుణకృష్ణ ! రామయరామకృష్ణ!

క|| కౌండిన్యసగోత్రుఁడ వా
     ఖండలగురునిభుఁడ వఖిలకావ్యరససుధా
     మండనకుండలుఁడవు భూ
     మండలవినుతుఁడవు లక్ష్మమావరతనయా !

"శా-రదనీరూపము రామకృష్ణ కవిచంద్రా ! సాంద్రకీర్తీశ్వరా”