పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

కృష్ణరాయల విద్యాగోష్ఠులు

- 1 -

కృష్ణరాయలయాస్థానమున నెనమండ్రు తెలుఁగుకవీశ్వరు లష్టదిగ్గజము లనుపేర వెలసియుండి రనులోకప్రతీతిని వీరేశలింగము పంతులుగారు విశ్వసింపకపోయిరి. కృష్ణరాయఁడు కవితాప్రియుఁడు గాన యాయనయాస్థానమందు లేకున్నను బలువురుకవీశ్వరుల నప్పటి వారినిగా భావించి పామరలోకము కట్టుకథలు కల్పించె నని వారు తలంచిరి. వీరేశలింగముపంతులుగారితలఁపు యుక్తమయినది కా దని యిప్పుడు స్పష్టముగాఁ దెలియవచ్చుచున్నది.

చాటుపద్యమణిమంజరి ద్వితీయభాగమునఁ గందుకూరి రుద్రకవిచరిత్రమును నేను రుద్రకవివంశ్యులకడనుండియే కైకొని ప్రకటించితిని. రాయలయాస్థానమునం దష్టదిగ్గజము లనఁబడునెనమండ్రు కవులలో రుద్రకవి యొకఁ డనియు, నాతఁ డీశాన్యసింహాసనాసీనుఁడై యుండువాఁ డనియు నందుఁ గలదు. అనఁగా రాయలసభాస్థాన మగుభువనవిజయమున నెనిమిదిదిక్కుల నెనిమిదిసింహాసనము లుండెడి వనియు, వానిపై దిగ్గజము లనఁబడు నెనమండ్రుకవులు నాసీనులై యుండెడివా రనియు నర్థమగుచున్నది. రుద్రకవిచరిత్రమే కాక యీక్రింది శాసనశ్లోకముగూడ రాయలయాస్థానమం దష్టదిగ్గజము లనుకవు లుండెడివా రని తెల్పుచున్నది.

శ్లో|| యత్కీర్తి ర్భువనైకభూషణ మభూ ద్యస్య ప్రసాదా న్నరా
      స్సర్వే రాజసమానతా ముపగతా స్సంప్రాప్య విత్తం బహు
      య స్యాష్టౌ కవిదిగ్గజాః పృథుయశోభారా జగచ్చోభనా
      యద్దానోదక సామ్య మేవ సరితా మాసేతుశీతాచలమ్.