పుట:Mana-Jeevithalu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఎవరు గురువో, సాధువో, నాయకుడో కనుక్కోవటం ముఖ్యం కాదు. ఎందుకు వారిని అనుసరిస్తున్నామనేది ముఖ్యం. లాభం పొందటానికీ, స్పష్టత కలగటానికీ, ఎవరినో అనుసరిస్తాం. స్పష్టత ఒకరు ఇవ్వగలిగేది కాదు. అస్పష్టత మనలోనే ఉంది. మనమే దాన్ని కొని తెచ్చుకున్నాం. మనమే దాన్ని స్పష్టపరచుకోవాలి. మనం ఏదో సంతృప్తికరమైన పదవినీ, అంతరంగిక రక్షణనీ, మత సంస్థ అధికార పరంపరలో ఒక స్థానాన్నీ సాధించి ఉండవచ్చు. కాని, ఇదంతా స్వార్ధపూరిత కార్యకలాపమే. అది సంఘర్షణకీ, దుఃఖానికీ దారి తీస్తుంది. మీరు సాధించిన దానితో తాత్కాలికంగా ఆనందించవచ్చు. మీ పదవి అనివార్యమైనదని మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోవచ్చు. మీరు ఏదో అవాలని అనుకున్నప్పుడు - అది ఏ స్థాయిలోనైనా సరే, దానివల్ల దుఃఖమూ, గందరగోళమూ తప్పవు. ఏమీ అవకుండా ఉండటం వ్యతిరేకత కాదు. ఇచ్ఛాపూర్వకమైన క్రియ అనుకూలమైనదైనా, వ్యతిరేకమైనదైనా, అది తీవ్రమైన, ప్రబలమైన వాంఛ. అది ఎప్పుడూ వైరుధ్యానికీ, సంఘర్షణకీ దారితీస్తుంది. అవగాహన కది మార్గం కాదు. అధికారాన్ని ప్రతిష్ఠించి, దాన్ని అనుకరించటం అవగాహన కాకుండా చేసుకోవటమే. అవగాహన ఉన్నప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. అది కొనగలిగినదీ, ఒకరు ఇచ్చేదీ కాదు. కొనుక్కున్నదాన్ని పోగొట్టుకోవచ్చు. ఇచ్చిన దాన్ని మళ్లీ పుచ్చేసుకోవచ్చు. అందువల్ల అధికారం, దానితో బాటే వచ్చే భయం, రెండూ పెంపొందించుకున్నవే. భయాన్ని ప్రార్థనతోనూ, దీపాలతోనూ పోగొట్టటానికి కుదరదు. ఏదో అవాలనే కోరిక అంతమైనప్పుడే అది అంతమవుతుంది.

29. ధ్యానం

ఆయన ధ్యానం అంటున్నదాన్ని చాలా ఏళ్ళపాటు సాధన చేశాడు. ఆ విషయం మీద ఎన్నో పుస్తకాలు చదివిన తరవాత, ఒక మఠానికి వెళ్లి అక్కడ రోజుకి కొన్ని గంటల సేపు ధ్యానం చేసే వాళ్లను చూసిన తరవాత ఆయన కూడా కొన్ని క్రమశిక్షణలను అవలంభించాడు. దాన్ని గురించి ఆయన అభిమానంతోనూ లేడు, అలాగని తను చేసిన త్యాగానికి ఆయనకి కళ్లలో నీళ్లు