పుట:Mana-Jeevithalu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధికారం

77

ప్రత్యేకమైన జ్ఞానం ఉన్నందుకు ఆవిడకి ఎంత సంతోషంగా ఉందో స్పష్టమవుతోంది.

ప్రత్యేక, రహస్య జ్ఞానం ప్రగాఢ సంతృప్తితో కూడిన సంతోషాన్నిస్తుంది. ఇతరులకు తెలియనిదేదో తనకి తెలియటం నిరంతర తృప్తి కలిగించేటట్లుగా ఉంటుంది. గౌరవాన్నీ, అధికారాన్నీ ఇచ్చే గంభీరమైన వేవో అందుబాటులో ఉన్నవన్న భావాన్ని కలిగిస్తుంది. మీరు వాటిని సూటిగా అందుకుంటున్నారు. ఇతరులికి లేనివేవో మీకున్నాయి. అందుచేత మీరు మీ దృష్టిలోనే కాక, ఇతరుల దృష్టిలో కూడా గొప్పవారు. ఇతరులు మీవైపు భయభక్తులతో చూస్తారు, మీకున్న దాంట్లో వారు కూడా భాగం పంచుకోవాలనుకుంటారు కనుక, మీరు ఇస్తారు, కాని, మరికొంత తెలుసుకుంటూ ఉంటారు. మీరు మార్గదర్శి అధికారి. ఈ హోదా మీకు సులభంగా లభిస్తుంది, ఎవరో ఒకరు చెప్పాలనీ, దారి చూపాలనీ జనం కోరుతూ ఉంటారు కనుక. మనం దారి తప్పినట్లూ అయోమయ స్థితిలో ఉన్నట్లూ తెలుసుకున్న కొద్దీ మరింత ఆత్రుత పడతాం - ఎవరైనా మనకి దారి చూపాలనీ, చెప్పాలనీ. అందుకని అధికారాన్ని ప్రభుత్వం పేరుతోనో, మతం పేరుతోనో, గురువు పేరుతోనో, లేదా, పార్టీ నాయకుని పేరుతోనో రూపొందించుకుంటాం.

పెద్ద విషయాల్లోగాని, చిన్న విషయాల్లోగాని, అధికారాన్ని ఆరాధించటం హానికరం. మత సంబంధమైన విషయాల్లో మరింత హానికరం. మీకూ సత్యానికీ నడుమ మధ్యవర్తి లేడు. ఎవరైనా ఉన్నట్లయితే అతడు వక్రమార్గంలో పెట్టేవాడే. హానికారకుడే. అతడు ఎవరు అన్నది ముఖ్య విషయం కాదు. మహోన్నత రక్షకుడు కావచ్చు. మీ సరికొత్త గురువు కావచ్చు. తెలుసుకున్నాడనుకున్న వాడికి తెలియదు. అతడు తెలుసుకోగలిగినవి - తనకున్న అయిష్టతలూ, తాను ఏర్పరచుకున్న నమ్మకాలూ, మనోవాంఛలూ, అంతే. సత్యాన్నీ, అపరిమితమైన దాన్నీ తెలుసుకోలేడు; హోదానీ, అధికారాన్నీ సంపాదించుకోవచ్చు, గడుసుగా అలవరచుకోవచ్చు, కాని అది నమ్రత మటుకు కాదు. సద్గుణం స్వేచ్ఛ నిస్తుంది. కాని అలవరచుకున్న నమ్రత సద్గుణం కాదు. కేవలం అనుభూతి మాత్రమే. అందుచేత అది హానికరం, వినాశకరం. అది పదే పదే తెంచుకోవలసిన బంధనం.