పుట:Mana-Jeevithalu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నమ్మకం

63

కూడా ఎంతో గౌరవింపబడింది. ఇప్పుడు నమ్మకాల గురించీ, సంస్థల గురించీ, ఆత్మవంచన వల్ల కలిగే ప్రమాదాలు, మొదలైన వాటి గురించి నేను చెప్పినదంతా విన్న మీదట ఆ సంస్థనీ, దాని కార్యక్రమాలనీ వదిలిపెట్టేసింది. ప్రపంచాన్ని ఉద్దరించటంలో ఇంక ఏ మాత్రం ఆసక్తి లేదు. తన చిన్న సంసారంతోనూ, దాని సమస్యలతోనూ కాలక్షేపం చేస్తున్నది. ప్రపంచం గురించి దూరంనుంచే ఆసక్తి తీసుకుంటున్నది. నిష్ఠురంగా మాట్లాడుతున్నట్లు తోచింది - పైకి సానుభూతి, ఔదార్యం ప్రదర్శించినప్పటికీ, ఎందు వల్లనంటే ఆవిడ జీవితమంతా వృథా అయిపోయిందని చెప్పింది. ఇంతకాలం అంత ఉత్సాహంతో శ్రమించినందుకు ఆవిడ సాధించిందేమిటి? ఆవిడకేం ఒరిగింది? ఆవిడ ఎందుకంత అనాసక్తంగా, అలిసిపోయినట్లుగా ఉంది? ఆ వయస్సులో ఆవిడకి స్వల్ప విషయాల గురించి ఎందుకంత ఆత్రుత?

మనలోని సున్నితత్వాన్ని మనం ఎంత సులభంగా నాశనం చేస్తున్నాం! నిరంతర సంఘర్షణతో, అంతులేని పోరాటంతో, వ్యాకులపడి తప్పించుకు పోవటంతో, భయాలతో శీఘ్రమే మనస్సునీ, హృదయాన్నీ మందకొడిగా చేస్తాం. కాని మనస్సు తన నైపుణ్యంతో సత్వరమే సున్నితత్వం స్థానంలో మరొకదాన్ని కనుక్కుంటుంది. వినోదాలు, సంసారం, రాజకీయాలు, నమ్మకాలు, దేవుళ్ళు - ఇవన్నీ స్పష్టత, ప్రేమ ఉండవలసిన స్థానంలో చోటు చేసుకుంటాయి. విజ్ఞానంవల్లా, నమ్మకాలవల్లా స్పష్టత పోతుంది. ఉత్తేజకరమైన అనుభూతుల వల్ల ప్రేమ పోతుంది. నమ్మకం స్పష్టతను తేగలదా? చుట్టూ బిగించి గోడ కట్టుకుని ఉండే నమ్మకం అవగాహన కలుగ నిస్తుందా? ఈ నమ్మకాల అవసరం ఏమిటి? అసలే క్రిక్కిరిసి ఉన్న మనస్సుని చీకటిమయం చేయవా? ఉన్నదాన్ని అర్ధం చేసుకోవటానికి నమ్మకాల అవసరం ఉండదు. సూటిగా గ్రహించాలి. కోరిక అనేది అడ్డుపడకుండా సూటిగా తెలుసుకోవాలి. కోరిక చేపట్టే మార్గాలు చాలా సూక్ష్మమైనవి. వాటిని అర్ధం చేసుకోకుండా ఉంటే, నమ్మకం సంఘర్షణనీ, సందిగ్దతనీ, ప్రతికూలతనీ అధికం చేస్తుంది. నమ్మకానికి మరోపేరు మతం. మతం కూడా కోరికకి రక్షణ కల్పించేదే.

నమ్మకాన్ని చర్యకి సాధనంగా పరిగణిస్తాం. ఏదైనా ప్రత్యేకతనుంచి