పుట:Mana-Jeevithalu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

లభించే విచిత్రమైన శక్తిని నమ్మకం కలుగజేస్తుంది. మనం ఏదో ఒకటి చెయ్యాలనే ఆదుర్దాతో ఉంటాం. కాబట్టి నమ్మకం అవసరమనిపిస్తుంది. నమ్మకం లేకుండా ఏపనీ చెయ్యలేమనుకుంటాం. మనం జీవించటానికీ, పని చెయ్యటానికీ అవసరమనిపించేదాన్ని నమ్మకం మనకిస్తుంది. మనలో చాలామందికి నమ్మకం ఇచ్చేది మినహాయించి జీవితానికి వేరే అర్ధం ఉండదు. జీవితాని కన్నా నమ్మకానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. మన నమ్మకం ప్రకారమే జీవితం గడపాలనుకుంటాం. ఏదో ఒక నమూనా లేనట్లయితే ఏ పని అయినా ఎలా సాధ్యం? అందుచేత మన చర్య ఒక అభిప్రాయంమీద ఆధారపడి గాని, ఒక అభిప్రాయ ఫలితమై గాని ఉంటుంది. అందుచేత చర్య అభిప్రాయమంత ముఖ్యం అవదు.

మానసికమైనవి ఎంత బ్రహ్మాండమైనవైనా, ఎంత సూక్ష్మమైనవైనా, కార్యాచరణ పూర్తి కావటానికీ, ఒకరి బ్రతుకులోనూ, తద్వారా సమాజ వ్యవస్థలోనూ సమూలమైన పరివర్తన తీసుకురావటానికీ ఎంతవరకు దోహదం చేస్తాయి? అసలు అభిప్రాయం అనేది కార్యాచరణకు సాధనం అవుతుందా? ఒక అభిప్రాయం కొంత కార్యాచరణకు వరుసగా దారి తీయవచ్చు. కాని అది కార్యసంరంభం మాత్రమే. కార్యసంరంభం కార్యాచరణకి పూర్తిగా విరుద్ధమైనది. ఈ కార్యసంరంభంలోనే ఎవరైనా చిక్కుకునేది. ఏదైనా కారణం వల్ల ఈ కార్యకలాపం ఆగిపోయినట్లయితే దిక్కు తెలియకుండా తప్పిపోయినట్లు, జీవితం అర్ధ శూన్యమైనట్లూ, శూన్యమైనట్లూ అనుకుంటారు. ఈ శూన్యతని గురించి మనకి చైతన్యంగా ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా తెలిసే ఉంటుంది. అందువల్లనే అభిప్రాయం, కార్యకలాపం అన్నిటి కన్నా ముఖ్యమైనవయ్యాయి. ఈ శూన్యతని మనం నమ్మకంతో నింపుతాము. దాంతో, కార్యకలాపం మత్తు కలిగించే అవసరంలా తయారవుతుంది. ఈ కార్యకలాపం కోసం మనం అన్నిటినీ త్యజిస్తాం. ఎటువంటి ఇబ్బందికైనా, ఎటువంటి భ్రమకైనా లోనవుతాం. నమ్మకంతో వచ్చే కార్యకలాపం సందిగ్ధ జనకంగా, వినాశకరంగా ఉంటుంది. మొదట్లో ఎంతో క్రమబద్ధంగా నిర్మాణాత్మకంగా ఉండొచ్చును. కాని, దాని వెనుకనే సంఘర్షణ, దుఃఖం ఉంటాయి. మత సంబంధమైనది