పుట:Mana-Jeevithalu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

చర్యలు సంఘవిద్రోహకరంగా ఉండవు. అతడు మరో మనిషికి వ్యతిరేకంగా ఉండడు. మంచి వాళ్ళందరితో సహకరిస్తూ జీవిస్తాడతను. అధికారాన్ని కాంక్షించడు. అతనికి అధికారం ఉండదు. నిర్దాక్షిణ్యత లేకుండా సామర్థ్యం చూపించ గలుగుతాడు. పౌరుడు మనిషిని త్యాగం చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తాడు. కాని, అత్యున్నత వివేకాన్ని శోధించే మనిషి సహజంగా ఆ పౌరుడి తెలివి తక్కువతనాన్ని పట్టించుకోడు. అందుచేత ప్రభుత్వం అటువంటి మంచిమనిషికీ, వివేకవంతుడైన మనిషికీ వ్యతిరేకంగా ఉంటుంది. కాని అటువంటి మనిషి అన్ని ప్రభుత్వాలనుంచీ, అన్ని దేశాల నుంచీ స్వేచ్ఛగా ఉంటాడు.

వివేకవంతుడైన మనిషి మంచి సమాజానికి దోహదం చేస్తాడు. కాని మంచి పౌరుడు మనిషి అత్యున్నత వివేకాన్ని పొందగలిగే సమాజాన్ని సృష్టించ లేడు. పౌరుడు ఆధిక్యం ప్రదర్శిస్తున్నప్పుడు పౌరుడికీ, మనిషికీ మధ్య సంఘర్షణ అనివార్యం. మనిషిని కావాలని నిర్లక్ష్యం చేసే ఏ సమాజమైనా నాశనమవుతుంది. మనిషి మానసిక ప్రక్రియ అర్థం చేసుకున్నప్పుడే పౌరుడికీ, మనిషికీ సామరస్యం కుదురుతుంది. ప్రభుత్వం, ప్రస్తుత సమాజం బాహ్య మానవుడిని, అంటే పౌరుడిని తప్ప అంతర్గతమైన మనిషిని గురించి పట్టించుకోదు. అంతర్గతమైన మనిషిని కాదనవచ్చు. కాని అతడే ఎప్పుడూ బాహ్యమానవుడిని ఓడిస్తాడు. పౌరుడికోసం కపటంగా చేసిన పథకాలను ధ్వంసం చేస్తాడు. ప్రభుత్వం భవిష్యత్తు కోసం ప్రస్తుతాన్ని త్యాగం చేస్తుంది. భవిష్యత్తు కోసం తన్ను తాను సదా సంరక్షించుకుంటూ ఉంటుంది. భవిష్యత్తుకే ప్రాధాన్యాన్ని అంతా ఇస్తుంది, ప్రస్తుతానికి కాదు. వివేకవంతుడైన మనిషికి ప్రస్తుతమే అత్యంత ప్రధానం; ఇప్పుడే, రేపు కాదు. రేపు అనేది అదృశ్యమయినప్పుడే ఉన్నదాన్ని అర్థం చేసుకోగలం. ఉన్నదాన్ని అర్ధం చేసుకున్నట్లయితే ప్రస్తుతం తక్షణమే పరివర్తన చెందుతుంది. ఈ పరివర్తనే అత్యంత ప్రధానమైనది; అంతేకాని పౌరుడికీ, మనిషికీ మధ్య సామరస్యం కుదర్చడం ఎలాగ అని కాదు. ఈ పరివర్తన జరిగినప్పుడు మనిషికీ, పౌరుడికీ మధ్య సంఘర్షణ అంతమవుతుంది.