పుట:Mana-Jeevithalu.pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


22. "నేను" (అహం)

ఎదురుగా ఉన్న సీటులో హోదా, అధికారం ఉన్న ఒకాయన కూర్చుని ఉన్నాడు. అవి తనకున్న సంగతి ఆయనకు బాగా తెలుసును. ఆయన చూపులూ, చేష్టలూ, మనోవైఖరీ అన్నీ ఆయన ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వంలో చాలా ఉన్నతస్థితిలో ఉన్నవాడు. ఆయన చుట్టుపక్కల వాళ్లందరూ చాల వినయవిధేయతలతో ఉన్నారు. ఎవరితోనో పెద్ద గొంతుతో చెబుతున్నాడు - అంత చిన్న వ్యవహారం కోసం తనను ఇబ్బంది పెట్టటం దౌర్జన్యం అని. తన క్రింద పనిచేసే వాళ్ల పనుల గురించి సాధిస్తున్నాడు. వింటున్నవాళ్లు భయంతో ఒణుకుతున్నారు. మేము ఆకాశంలో పద్దెనిమిది వేల అడుగుల ఎత్తున మేఘాలకు బాగా పైనుంచి వెడుతున్నాం విమానంలో. మేఘాలమధ్య సందుల్లోంచి క్రింది నీలి సముద్రం కనిపిస్తోంది. మబ్బులు మధ్యమధ్య విడిపోయినప్పుడు మంచుతో నిండిన పర్వతాలూ, ద్వీపాలూ, విశాలమైన సముద్రశాఖలూ, అక్కడక్కడ ఇళ్లూ, చిన్న చిన్న ఊళ్ళూ, ఎంత దూరంగా ఎంత అందంగా కనిపిస్తున్నాయి! కొండల్లోంచి పారుతూ వచ్చిన నది సముద్రంలోకి ప్రవహిస్తుంది. మధ్యలో ఒక పెద్ద పట్టణంలోంచీ ప్రవహిస్తూ వచ్చింది. దాని నీళ్లు మురికి కలిసిన చోట మసి బారినట్లు వెలవెలబోయి నట్లుండి, మరికొంత దూరం వచ్చాక, మళ్లీ పరిశుభ్రంగా అయి, తళతళ లాడుతున్నాయి. కొన్ని సీట్లకి అవతల ప్రత్యేకమైన దుస్తుల్లో ఉన్న ఒక ఉన్నతోద్యోగి కూర్చున్నాడు. ఆయన ఛాతీ నిండా రిబ్బన్లు. ఆత్మ విశ్వాసంతో, ఎవ్వరితోనూ కలవకుండా కూర్చున్నాడు. ఆయన వేరే వర్గానికి చెందినవాడు. అటువంటి వర్గంవారు ప్రపంచమంతటా ఉన్నారు.

మనం అందరి చేతా గుర్తింపబడాలనీ, గొప్పగా చెప్పుకోబడాలనీ, ప్రోత్సహింపబడాలనీ ఎందుకు ప్రాకులాడుతాం? అంత డాబూ, దర్పం ఎందుకు ప్రదర్శిస్తాం? ప్రత్యేకమైన పేరునీ, పదవినీ, ఆస్తినీ పట్టుకుని ఎందుకు వ్రేలాడతాం? అనామకులుగా ఉంటే చిన్నతనంగా ఉంటుందా? మనగురించి ఎవరికీ ఏమీ తెలియకుండా ఉంటే నీచంగా ఉంటుందా? పేరు పొందిన వారినీ, ప్రజాదరణ పొందిన వారినీ మనం ఎందుకు అనుసరిస్తాం?