పుట:Mana-Jeevithalu.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

318

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఉండాలనే నా ఆదర్శం. ధార్మికంగా ఉండటం మా రక్తంలో ఉంది. నేను కూడా అలా ఉండగలననుకున్నాను. కాని దాని దరిదాపులకి కూడా చేరలేమోనని లోలోపల ఎప్పుడూ భయం ఉండేది."

మెల్లిగా పరిశీలిద్దాం. బాహ్యంగా భద్రత ఉండదని మీరు భయపడక పోతున్నప్పటికీ, అంతరంగికంగా భద్రత ఉండదేమోనని మీ భయం. ఇంకో మనిషి బాహ్యంగా పేరు ప్రఖ్యాతులతో, డబ్బూ మొదలైన వాటితో సురక్షితంగా ఉండేటట్లు చేసుకుంటాడు. మీరు ఒక ఆదర్శం ద్వారా అంతర్గతంగా భద్రత కోరుతున్నారు. ఆ ఆదర్శం ప్రకారం మీరు అవలేనమోననుకుంటున్నారు. ఒక ఆదర్శం ప్రకారం అవాలనిగాని, ఆదర్శాన్ని సాధించాలనిగాని ఎందుకు కోరుకుంటున్నారు? సురక్షితంగా ఉండటానికీ, క్షేమంగా ఉన్నట్లు అనుకోవటానికీ మాత్రమేనా? ఈ ఆశయాన్ని మీరు ఆదర్శం అంటున్నారు. మీరు క్షేమంగా ఉండాలనుకుంటున్నారు. మీకు భద్రత కావాలి, అంతేనా?

"మీరిప్పుడు సూచించినట్లు, సరిగ్గా అదే."

దీన్ని మీరిప్పుడు కనుక్కున్నారు. కనుక్కోలేదూ? అయితే, ఇంకా ముందుకి సాగుదాం. బాహ్యరక్షణలోని వెలితిని స్పష్టంగా గ్రహించారు మీరు, కాని ఒక ఆదర్శం ద్వారా అంతర్గత రక్షణకోసం అన్వేషించటంలోని అసత్యాన్ని కూడా గ్రహిస్తున్నారా? ఆదర్శమే ఆశ్రయం - డబ్బుకి బదులుగా. దీన్ని నిజంగా గ్రహిస్తున్నారా?

"అవును, నిజంగానే గ్రహించాను."

అయితే మీరు ఉన్నట్లుగానే ఉండండి. ఆదర్శం యొక్క అసత్యాన్ని గ్రహించినప్పుడు దానంతటదే పడిపోతుంది. ఉన్నది ఉన్నట్లుగానే ఉంటారు మీరు. అక్కణ్ణించి ఉన్న స్థితిని అర్థం చేసుకోవటం మొదలుపెట్టండి - కాని ఒక ప్రత్యేక లక్ష్యం వైపుకి కాదు, ఎందుకంటే, లక్ష్యం ఎప్పుడూ ఉన్నస్థితి నుంచి దూరంగానే ఉంటుంది. ఉన్నస్థితి మీరే, ఒక ప్రత్యేక సమయంలో గాని, ఒక మానసిక స్థితిలో గాని కాదు. మీరు క్షణక్షణానికీ ఉన్నట్లుగానే. మిమ్మల్ని మీరు నిందించుకోకండి, మీరు చూసిన దానితో ఆశ వదులుకునేట్లుగా అవకండి. ఉన్నదాని గతిని వ్యాఖ్యానించకుండా జాగ్రత్తగా గమనించండి.