పుట:Mana-Jeevithalu.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

296

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఆలోచన కాలం ఫలితం కాదా? జ్ఞానం అంటే కాలం కొనసాగటం. కాలం అంటే కొనసాగింపు. అనుభవం అంటే జ్ఞానం. అనుభవం జ్ఞాపకంగా కొనసాగడమే కాలం. ఇలా కొనసాగే కాలానికి రూపం లేదు. ఊహాగానాలు చేయడం అజ్ఞానం. అనుభవం అంటే జ్ఞాపకం, మనసు అనేది కాలయంత్రం. మనస్సు అంటే గతం. ఆలోచన ఎప్పుడూ గతానికి చెందేదే. గతం కొనసాగితేనే జ్ఞాపకం. జ్ఞానం ఎప్పుడూ గతానికి చెందినదే. జ్ఞానం కాలానికి చెందకుండా ఎప్పుడూ ఉండదు, ఎప్పుడూ కాలంలోనే, కాలానికి చెందే ఉంటుంది. ఇలా జ్ఞాపకం, జ్ఞానం కొనసాగటమే చైతన్యం. అనుభవం ఎప్పుడూ గతంలోనిదే; అదే గతం. ఆ గతం ప్రస్తుతంతో కలిసి భవిష్యత్తులోకి జరుగుతోంది. భవిష్యత్తు గతమే, కొంత మార్పుచెంది ఉండవచ్చు, అయినప్పటికే గతమే. ఈ ప్రక్రియ అంతా కలిసే ఆలోచన, మనస్సు. ఆలోచన కాలం పరిధిలో తప్ప ఇంకెందులోనూ పనిచెయ్యలేదు. కాలరహితమైన దాన్ని గురించి ఆలోచన ఊహించవచ్చు, కాని అది దాని కల్పన మాత్రమే. ఊహా, కల్పనా అంతా మూర్ఖత్వం.

"అయితే మీరు కాలరహితమైన దాన్ని గురించి మాత్రం ప్రస్తావించటమెందుకు? కాలరహితమైనది ఎప్పటికైనా తెలుస్తుందా? కాలరహితమైనదని దాన్ని గుర్తించటానికి వీలవుతుందా?"

గుర్తించటం అంటే అనుభవించేవాడున్నట్లు అర్థం వస్తుంది. అనుభవించేవాడు ఎప్పుడూ కాలానికి చెందినవాడే. దేన్నైనా గుర్తుపట్టటానికి, దాన్ని అంతకుముందు అనుభవం పొంది ఉండాలి. అనుభవం పొంది ఉంటే అది తెలిసినదే. తెలిసినది కాలరహితమైనది కాదు, నిశ్చయంగా. తెలిసినది ఎప్పుడూ కాలం అనే వలలోనిదే. ఆలోచన కాలరహితమైన దాన్ని తెలుసుకోలేదు. అది మరింత సేకరించటం కాదు, మరికొంత సాధించటం కాదు. దానివైపుకి వెళ్లటం అంటూ ఉండదు. ఆలోచన గాని, కాలంగాని లేకుండా ఉండే స్థితి అది.

"దానికి ఏమిటి విలువ?"

ఏమీలేదు. విలువ కట్టవీలుకానిది. ఒక ప్రయోజనం కోసం దాని విలువ ఎంచలేము. దాని విలువ తెలియనిది.