పుట:Mana-Jeevithalu.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలం

295

తేదీల వారీగా జరిగే కాలం తప్ప ఇంకో కాలం గురించి ఎవరైనా ఆలోచించగలరా? దాని మటుకు దానికి ఏవిధమైన ప్రాధాన్యం లేదు. అస్పష్టకాలం కేవలం ఊహమాత్రమే. ఊహామాత్రమైనదేదైనా వ్యర్థమే. కాలాన్ని మనం సాధించేందుకు మార్గంగా వినియోగించుకుంటాం - వాస్తవంగా గాని, మానసికంగాని, స్టేషనుకి వెళ్లటానికి పట్టేకాలం అవసరం. కాని మనలో చాలామంది కాలాన్ని మానసిక లక్ష్యానికి సాధనంగా ఉపయోగిస్తారు. అటువంటి లక్ష్యాలు అనేకం. మనం సాధించవలసిందానికి ఆటంకం కలిగినప్పుడూ, విజయవంతం అవటానికి కొంత విరామం ఉన్నప్పుడూ, కాలం తెలుసుకుంటాం. ఉన్నస్థితికీ, ఉండబోయిన, ఉండవలసిన, ఉండాలనుకున్న స్థితికీ మధ్యనున్న స్థలమే కాలం. ఆరంభం అంతాన్ని చేరుకునేదే కాలం.

"వేరే ఇంకేవిధమైన కాలమూ లేదా? శాస్త్రరీత్యా కాలం, విరామం వీటికి అంతరార్థాలేమిటి?"

తేదీల వారీగా ఉండేకాలం ఉంది, మానసిక కాలం ఉంది. తేదీల వారీ కాలం అవసరం. అది ఉన్నది. కాని ఇంకోటి వేరే విషయం. కారణం, ఫలితం కాలప్రక్రియ అంటారు. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా. కారణానికీ ఫలితానికీ మధ్య ఉన్న విరామమే కాలమనుకోబడుతుంది. కాని విరామం ఉన్నదా? రోగం విషయంలో కారణాన్నీ ఫలితాన్నీ విడదీయవచ్చునేమో అదికూడా తేదీలవారీ కాలమే. కాని మానసిక కారణానికీ, ఫలితానికీ మధ్య విరామం ఉంటుందా? కారణం, ఫలితం ఒకే ప్రక్రియ కాదా? కారణానికీ ఫలితానికీ మధ్య విరామం లేదు. ఈ రోజు నిన్నటి ఫలితం, రేపటికి కారణం. అది ఒకే కదలిక, కొనసాగే ప్రవాహం. కారణానికీ ఫలితానికీ మధ్య ఎడంలేదు, విడదీసే రేఖ లేదు. కాని అంతరంగికంగా వాటిని విడదీస్తాం, ఏదో అవటానికీ, సాధించటానికీ, నేను ఇది, నేను అది అవాలి.అది అవటానికి నాకు సమయం కావాలి - తేదీలవారీ కాలం మానసిక ప్రయోజనాలకోసం ఉపయోగించబడుతుంది. నేను మూర్ఖుణ్ణి, నేను వివేకిని అవాలి. మూర్ఖత్వం వివేకంగా అవటం అంటే మూర్ఖత్వం క్రమంగా ఎక్కువవటమే, ఎందుకంటే మూర్ఖత్వం ఎప్పటికీ వివేకం కాలేదు - ఆశ ఆశకాకపోవటం అవనట్లుగానే. ఏదో అవాలనుకోవటమే మూర్ఖత్వం.