పుట:Mana-Jeevithalu.pdf/303

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
294
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ముందుకెప్పటికో నెట్టటం జరుగుతుంది. మనలో చాలా మందికి కారణం తెలుసును. ద్వేషానికి కారణం కనిపించనంత మరీ నిగూఢంగా ఉండదు. కారణం వెతుకుతూనే ద్వేషంవల్ల కలిగే ఫలితాలను ఆనందంగా అనుభవిస్తూనే ఉంటాం. ఫలితాలతో సమాధాన పడటమే తప్ప మొత్తం ప్రక్రియని అర్థం చేసుకోవటం కాదు మనక్కావలసింది. మనలో చాలా మంది సమస్యల్నే పట్టుకుని ఉంటారు. అవి లేకపోతే మనకి దారితోచదు. సమస్యలు మనకి పని కల్పిస్తాయి. సమస్యలకి సంబంధించిన కార్యకలాపాలతోనే మన జీవితాలు నిండి ఉంటాయి. మనమే సమస్య, దాన్ని కార్యకలాపాలూను.

కాలం చాలా చిత్రమైన ప్రకృతివిశేషం. స్థలం, కాలం ఒక్కటే. ఒకటి ఉంటే గాని ఇంకోటి ఉండదు. కాలం మనకి అత్యంత ముఖ్యం. ప్రతి ఒక్కరూ దానికి తమ ప్రత్యేక అర్థాన్నిస్తారు. అనాగరికుడికి కాలంతో ప్రమేయం ఉండదు. కాని, నాగరికులకు అది అత్యంత ప్రధానమైనది. అనాగరికుడు ఏరోజు కారోజు మరిచిపోతాడు. కాని, విద్యావంతుడలా చేస్తే పిచ్చాసుపత్రిలో పెడతారు, లేదా, ఉద్యోగం పోతుంది. శాస్త్రజ్ఞుడి ఉద్దేశంలో కాలం ఒకలా ఉంటుంది. మామూలు మనిషికి మరొకలా ఉంటుంది. చరిత్రకారుడికి కాలం అంటే అర్థం గతాన్ని అధ్యయనం చేయడం, స్టాక్ మార్కెట్‌లో టిక్కు టిక్కుమనటం, తల్లికి కొడుకు జ్ఞాపకం, అలిసిపోయిన వాడికి నీడలో విశ్రాంతి. ప్రతి ఒక్కరూ తమ తమ అవసరాన్ని బట్టి, తృప్తి కలగటాన్ని బట్టీ అనువదించుకుని, తమ గడుసు మనస్సుకి సరిపోయేలా మలుచుకుంటూ ఉంటారు. అయితే. మనం కాలం లేకుండా ఉండలేం. మనం జీవించాలంటే ఋతువు అవసరమైనంతగానూ తేదీల ప్రకారం కాలం అవసరం. కాని, మానసిక కాలం అంటూ ఏదైనా ఉందా, లేక అది మనస్సు తనకు వీలయేటట్లుగా చేసిన వంచన మాత్రమేనా? తేదీల వారీగా ఉండేకాలం తప్ప తక్కినదంతా వంచనే, నిశ్చయంగా. పెరగటానికీ, చనిపోవటానికీ, విత్తనం నాటడానికీ, ఫలం అందుకోవటానికీ కాలం పడుతుంది. కాని, మానసిక కాలం అంటే ఏదో అవటం అనే ప్రక్రియ పూర్తిగా అసత్యమైనది కాదా?

"మీకు కాలం ఏమనిపిస్తుంది? మీరు కాలం గురించి ఆలోచిస్తారా? కాలాన్ని తెలుసుకున్నారా మీరు?"