పుట:Mana-Jeevithalu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. ఆలోచన, ప్రేమ

ఆలోచన ఆవేశపూరితమైనదీ, ఉద్రిక్తకరమైనదీ కాబట్టి అది ప్రేమ కాదు. ఆలోచన ఉన్నప్పుడు ప్రేమకి తావు లేదు. ఆలోచన జ్ఞాపకాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమ జ్ఞాపకం కాదు. మీరు ప్రేమించే ఒక వ్యక్తి గురించి మీరు ఆలోచించునప్పుడు ఆ ఆలోచన ప్రేమకాదు. మీ స్నేహితుని అలవాట్లనూ, ప్రవర్తించే లక్షణాలనూ, అవలక్షణాలనూ గుర్తుకి తెచ్చుకోవచ్చు. ఆ వ్యక్తితో మీకున్న సంబంధాన్ని బట్టి జరిగిన మంచి సంఘటనల్నీ చెడు సంఘటనల్నీ గుర్తుకి తెచ్చుకోవచ్చు. కాని, ఆ ఆలోచనలు ప్రేరేపించే మనశ్చిత్రాలు మాత్రం ప్రేమకాదు. విభజన చేయటం ఆలోచన సహజ లక్షణం. సమయాభావం, స్థలాభావం, దూరం, దు:ఖం, అన్నీ ఆలోచన వల్ల పుట్టినవే. ఆలోచనా ప్రక్రియ ఆగిపోయినపుడే ప్రేమ ఉండటానికి సాధ్యమవుతుంది.

ఆలోచన ఎప్పుడైతే ఉందో అప్పుడు తన సొంతం అనే భావం కలగక మానదు. సొంతం చేసుకోవాలనే భావం వ్యక్తంగా కాని, అవ్యక్తంగా కాని, ఈర్ష్యని పెంచుతుంది. ఈర్ష్య ఉన్నప్పుడు ప్రేమ ఉండదనేది స్పష్టమే. అయినా చాలామంది ఈర్ష్య ప్రేమకి చిహ్న మనుకుంటారు. ఈర్ష్య ఆలోచన వల్ల వచ్చేదే. అది ఆలోచనలోని ఆవేశానికి ప్రతిక్రియ. తన సొంతం చేసుకోవాలనే భావానికి గాని, తను ఇంకొకరి సొంతం కావాలనే భావానికి గాని అవరోధం కలగగానే ఎంతో శూన్యత ఏర్పడి, ఆస్థితిలో ప్రేమ స్థానంలో ఈర్ష్య చోటుచేసుకుంటుంది. ఆలోచన ప్రేమ స్వరూపాన్ని దాల్చుతుంది కనుకనే అన్ని చిక్కులూ, దు:ఖాలూ కలుగుతున్నాయి. ఒకరి గురించి ఆలోచించకుండా ఉంటే ఆ వ్యక్తిని ప్రేమించలేదనుకుంటారు. కాని ఒక వ్యక్తిని గురించి ఆలోచించినంత మాత్రాన అది ప్రేమ అవుతుందా? మీరు ప్రేమించే స్నేహితుడెవరి గురించైనా మీరు ఆలోచించకుండా ఉంటే, మీరు దాన్ని ఘోరమైన విషయమనుకుంటారు. అనుకోరా? చచ్చిపోయిన ఒక స్నేహితుణ్ణి తలుచుకోక పోయినట్లయితే మీకు విశ్వాసం లేనట్లూ, ప్రేమ లేనట్లూ, ఇంకా ఎన్నో అనుకుంటారు. అటువంటి స్థితిని లెక్కచేయక