పుట:Mana-Jeevithalu.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
9
వ్యర్థ ప్రసంగం, వ్యాకులత

మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు స్ఫురిస్తుందా? కాని, చాలా మందికి ప్రశాంతమైన మనస్సు భయంకరంగా తోస్తుంది. ప్రశాంతంగా ఉండాలంటేనే భయంవాళ్ళకి. ఏమో, తమలో ఏం కనుక్కుంటారో ఎవరికి తెలుసు. అందుకని ఆందోళన ఆటంకంగా ఉంటుంది. ఏదైనా కనుక్కోవటానికి భయపడే మనస్సు ఎప్పుడూ తన్ను తాను సంరంక్షించుకుంటూనే ఉంటుంది. అస్తిమితంగా ఉండటమే దానికి కారణం.

నిత్యం పడే శ్రమతో, అలవాట్లతో, పరిస్థితుల ప్రభావంతో మనస్సు యొక్క చైతన్యపు పొరలు ఆందోళనకీ, అస్తిమితతకీ గురి అయివుంటాయి. మనస్సుకి ఒక విధమైన రక్షణ నిచ్చే బాహ్య చర్యల్నీ, చాంచల్యాన్నీ ఆధునిక జీవితం ప్రోత్సహిస్తుంది. రక్షణ ఉంటే ప్రతిఘటన ఉంటుంది. అది అవగాహనశక్తిని నిరోధిస్తుంది.

వ్యర్థ ప్రసంగం చేయటంలో లాగే, వ్యాకులపడటంలో కూడా కొంత తీవ్రమైన, గంభీరమైన పోకడ లేకపోలేదు. కాని, పరీక్షగా చూస్తే తెలుస్తుంది - అది ఆకర్షణ వల్ల ఏర్పడినదేగాని, చిత్తశుద్ధి వల్లకాదని. ఆకర్షణ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. అందువల్లనే వ్యాకుల పడే సందర్భాలు, వ్యర్థ ప్రసంగాల్లోని విషయాలూ మారుతూ ఉంటాయి. కాని, మార్పు అంటే, కొనసాగుతున్న దానికి కొద్దిగా మెరుగులు పెట్టటం మాత్రమే. మనస్సులోని వ్యాకులతని అర్దం చేసుకొన్నప్పుడే, ఊరికే కబుర్లు చెప్పటం, వ్యాకులపడటం అంతమౌతాయి. మానేసినందువల్లా, తగ్గించినందువల్లా ప్రశాంతత రాదు. మనస్సు మరింత మొద్దుబారి, సున్నితత్వాని కొల్పోయి, పరిమితమైపోతుంది.

కుతూహలం కనపరచటం అర్థం చేసుకోవటానికి మార్గం కాదు. స్వీయజ్ఞానంతోనే అవగాహన కలుగుతుంది. బాధపడే వాళ్ళు ఎప్పుడూ కుతూహలం కనపరచరు. ఉత్తి ఊహలతో కూడిన కుతూహలం ఆత్మజ్ఞానానికి అవరోధం. కుతూహలం కూడా ఊహించటం లాగే వ్యాకులతని సూచిస్తుంది. స్తిమితంగా లేని మనస్సు ఎంత గొప్పదైనప్పటికీ, అవగాహననీ, ఆనందాన్నీ నాశనం చేస్తుంది.