పుట:Mana-Jeevithalu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

వ్యవహారాల గురించి తాపత్రయ పడటమే కొందరి పని. లెక్కలేనన్ని పత్రికలు, పేపర్లూ వాటిలోని కబుర్ల గురించీ, హత్యల గురించీ, విడాకులు లాంటి గొడవల గురించీ చదవటంలో ఆ తాపత్రయం కనిపిస్తుంది.

ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అని బాధ పడతాం కాబట్టి వాళ్లందరి గురించీ మనం అన్నీ తెలుసుకోవాలనుకుంటాం. దీన్నుంచే అనేక రకాలుగా, మోటుగా, నాజూగ్గా గొప్పలు పోవటం, అధికారాన్ని ఆరాధించటం జరుగుతుంది. ఈవిధంగా మనకి అంతకంతకి పై పటారం పెరిగి, లోపల శూన్యం మిగులుతుంది. పైడాబు ఎంతగా ఉంటే, అన్ని అనుభూతులూ, అన్ని ఆకర్షణలూ ఉండాలి మనకి. దీనితో మనస్సు ఎప్పుడూ స్తిమితంగా ఉండదు - దేన్నైనా శోధించటానికి గాని, కనుక్కోవటానికి గాని.

వ్యర్థ ప్రసంగం ద్వారా వ్యక్తమయేది స్తిమితంలేని మనస్సు. మౌనంగా ఉన్నంత మాత్రాన ప్రశాంతమైన మనస్సు అని సూచన కాదు. ప్రశాంతత ఏదైనా మానుకున్నందువల్లగానీ, వద్దనుకున్నందువల్లగానీ రాదు. ఉన్నదాన్ని అర్థం చేసుకోవటంతో వస్తుంది. ఉన్నస్థితిని అర్ధం చేసుకోవాలంటే చురుకుగా తెలుసుకోగలిగి ఉండాలి, ఎందుచేతనంటే ఉన్నది ఎప్పుడూ స్థిరంగా ఉండదు కనుక.

మనం వ్యాకుల పడకుండా ఉంటే మనం జీవించటం లేదనే అనుకుంటారు మనలో చాలమంది. ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉండటమే బ్రతుకు లక్షణం అని చాలా మంది అనుకుంటారు. సమస్యలేని జీవితాన్ని మనం ఊహించలేం. ఏదైనా సమస్యతో ఎంత హడావిడిగా ఉంటే అంత చురుకుగా ఉన్నామనుకుంటూ ఉంటాం. నిత్యం ఏదో ఒక సమస్యతో సతమత మవుతూ ఉండటంవల్ల - ఆలోచనలే సమస్యల్ని పుట్టిస్తాయి కాబట్టి - మనస్సు మొద్దుబారిపోయి, సున్నితత్వాన్ని కోల్పోయి, అలిసి పోతుంది.

ఏదో ఒక సమస్యతో నిత్యం సతమతమవటం ఎందుకు? ఆందోళన పడినంత మాత్రాన సమస్య తీరిపోతుందా? లేక, సమస్యకి పరిష్కారం