పుట:Mana-Jeevithalu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

చెయ్యటానికి అన్ని ప్రయత్నాలూ చెయ్యాలి. అప్పుడే అది పోతుంది" అన్నాడాయన.

మీరు చెప్పిన దాన్ని బట్టి ఎన్నో సంవత్సరాలుగా మీకు దురాశతో సంఘర్షణ జరుగుతోంది. మీరు తగినంతగా కష్టపడి ప్రయత్నించలేదని చెప్పకండి. అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. సంఘర్షణ ద్వారా మీరేమైనా అర్థం చేసుకోగలరా? జయించటం అంటే అర్థం చేసుకోకపోవటమే. మీరు జయించిన దాన్ని మళ్లీ మళ్లీ జయించాలి. కాని, పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు అర్థం చేసుకున్న దాన్నుంచి విముక్తి లభిస్తుంది. అర్థం చేసుకోవటానికి ప్రతిఘటనా ప్రక్రియ తెలుసుకోవాలి. అర్థ చేసుకోవటం కన్న ప్రతిఘటించటం సులభం. పైగా, ప్రతిఘటించమనే మనకి బోధించారు. ప్రతిఘటించటానికి గమనించనక్కరలేదు, విచారించనక్కర్లేదు, తెలియజేయనక్కరలేదు. ప్రతిఘటన మనస్సు యొక్క మందకొడితనాన్ని సూచిస్తుంది. ప్రతిఘటించే మనస్సు అహంభావపూరితమై ఉంటుంది. సున్నితత్వం గాని, అవగాహనగాని దానికి సాధ్యం కావు. దురాశ లేకుండా చేసుకోవటం కన్నా, ప్రతిఘటన ధోరణి గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. నిజానికి, చెబుతున్న దాన్ని మీరు వినిపించుకోవటం లేదు. ఇన్ని సంవత్సరాలుగా మీరు చేసిన పోరాటానికి, ప్రతిఘటనకీ ఫలితంగా మీలో పెరిగిన విశ్వాసాల గురించి ఆలోచిస్తున్నారు మీరు. మీరు అ విశ్వాసాలకి అంకితమై ఉన్నారు. మీ విశ్వాసాల గురించి మీరు ప్రసంగించి ఉండవచ్చు. రాసి ఉండవచ్చు. స్నేహితులను కూడ దీశారు. మీ దివ్యజ్ఞాన సంపన్నుని వలన మీరు లాభం పొందగలరని ఆశిస్తున్నారు - మీ ప్రతిఘటనలో ఆయన సహాయపడ్డాడు కనుక. అందుచేత మీ గతం అడ్డునిలిచి, ప్రస్తుతం చెబుతున్నదాన్ని విననీయటం లేదు.

"మీరు చెప్పిన దాన్ని ఒప్పుకుంటున్నాను, ఒప్పుకోవటం లేదు కూడా" అన్నాడాయన.

దాన్ని బట్టే తెలుస్తోంది మీరు వినటం లేదని. మీ విశ్వాసాలనూ, ఇప్పుడు చెబుతున్న దాన్నీ పోల్చి చూస్తున్నారు. అంటే, వినకపోవటమే. వినటానికి మీకు భయం. అందుకని మీరు సంఘర్షణలో పడ్డారు.