పుట:Mana-Jeevithalu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

రక్షణ చేసుకోవటం, అంటే తన్నుతాను అభేద్యమైన వానిగా చేసుకోవడం. ఐక్యం చేసుకోవటంలో ప్రతిఘటన ఉంటుంది - పైకి కనిపించినా, కనిపించకపోయినా. ప్రేమ అనేది ఆత్మరక్షణ కోసం చేసే ఒకరకమైన ప్రతిఘటనా? రక్షణ చేసుకుంటున్నప్పుడు ప్రేమ ఉంటుందా?

ప్రేమ ఇట్టే ప్రమాదానికి లోనవుతుంది. ఎంతో సున్నితంగా దేన్నైనా స్వీకరించటానికి సిద్దంగా ఉంటుంది; అది అత్యంత సున్నితమైనది. ఐక్యభావన వల్ల సున్నితత్వం లేకుండా పోతుంది. ఐక్యభావనా, ప్రేమా ఒకచోట ఇమడవు. ఒకటి రెండవదాన్ని నాశనం చేస్తుంది. ఐక్యం కావటం అనేది ముఖ్యంగా ఒక మానసిక ప్రక్రియ. దానితో మనస్సు తన్ను తాను సంరక్షించుకుంటూ, తన్ను తాను విస్తరింపచేసుకుంటుంది. ఏదో అవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనస్సు ప్రతిఘటించవలసి ఉంటుంది. రక్షించుకోవలసి ఉంటుంది. సొంతం చేసుకోవలసి ఉంటుంది. వదిలిపెట్టవలసి ఉంటుంది. ఏదో అవటానికి ప్రయత్నించటంలో మనస్సు లేదా అహం మరింత మొండిగానూ, శక్తిమంతంగానూ తయారవుతుంది. కాని, ఇది ప్రేమకాదు. ఐక్యం చేసుకోవటం వల్ల స్వేచ్ఛ నాశనమవుతుంది. స్వేచ్ఛ ఉన్నప్పుడే అత్యున్నతమైన సున్నితత్వం ఉంటుంది.

ఏదైనా పరీక్షించి చూడడానికి ఐక్యభావన అవసరమా? తాదాత్మ్యం చెందడంతోనే విచారణ చేయడం, తెలుసుకోవడం అనేవి అంతమైపోవా? తన్ను తాను తెలుసుకోవడం కోసం అన్వేషణ లేకపోతే సత్యం వల్ల పొందే ఆనందానికి ఆస్కారమే ఉండదు. ఐక్యం కావటం వల్ల సత్యాన్ని తెలుసుకోవటం జరగదు. ఐక్యం కావటం ఇంకో రకమైన సోమరితనం. ఐక్యం కావటం స్వయంగా పొందే అనుభవం కాకుండా తెచ్చి పెట్టుకున్న అనుభవం. అందువల్ల అది శుద్ద అసత్యం.

అనుభవం పొందాలంటే ఐక్యం కావటం అనేది ఆగిపోవాలి. క్రొత్త ప్రయోగం చెయ్యటానికి భయం ఉండకూడదు. భయం అనుభవానికి ఆటంకం. ఈ భయమే ఐక్యం పొందేటట్లు - ఎవరో వ్యక్తితోనో, ఏదో వర్గంతోనో, సిద్ధాంతం మొదలైన వాటితోనో ఐక్యం పొందేటట్లు చేస్తుంది.