పుట:Mana-Jeevithalu.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
5
తాదాత్మ్య భావన

బౌద్ధుడనీ ఎందుకు చెప్పుకుంటారు? ఏదో ఒక మతశాఖకి ఎందుకు చెందుతారు? మతంలోనైనా, రాజకీయాల్లోనైనా, ఎవరో వ్యక్తితోనో, ఏదో వర్గంతోనో, సంప్రదాయ సిద్దంగా గాని, అలవాటు ప్రకారం గాని, తాత్కాలికోద్రేకం చేతగాని, దురభిమానం చేతగాని, అనుకరణ ద్వారాగాని, బద్ధకం చేతగాని ఎందుకు మమైక్యం అవుతారు. ఇటువంటి తాదాత్మ్యభావన, సృజనాత్మకమైన అవగాహనని అంతం చేస్తుంది. దాంతో, ఒక 'పార్టీ' అధికారి చేతుల్లోనో, మరోనాయకుడి చేతుల్లోనో, కీలుబొమ్మలవుతారు.

ఆ మధ్య ఎవరో ఒకాయన తాను కృష్ణమూర్తిని అనుసరించే వాడిననీ, మరొకాయన ఇంకేదో వర్గానికి చెందిన వాడిననీ అన్నారు. అలా అంటున్నప్పుడు ఆయనకి ఇటువంటి తాదాత్మ్య భావనలో ఉండే చిక్కులను గురించిన స్పృహ ఏమాత్రం లేదు. అలాగని ఆయన తెలివి తక్కువ వాడేమీ కాదు. బాగా చదువుకున్నవాడు. సంస్కారం అవీ ఉన్నవాడు. ఆయన ఏదో అభిమానంతోనూ, భావోద్వేగంతోనూ అన్న విషయం కాదది. స్పష్టంగా, నిశ్చితంగా అన్నాడాయన.

ఆయన కృష్ణమూర్తిని అనుసరించే వాడిగా ఎలా అయ్యాడు? అంతకు ముందు ఎందరినో అనుసరించాడు. ఎన్నో సంఘాల్లోనూ, సంస్థల్లోనూ చేరి ప్రయాసపడ్డాడు. ఆఖరికి ఈ వ్యక్తితో ఐక్యత చెందేవరకూ వచ్చాడు. ఆయన అన్నదాన్ని బట్టి ఆయన ప్రయాణం పూర్తయింది. ఆయన ఒక స్థిరాభిప్రాయానికి వచ్చాడు. దాంతో ఇంక ఆఖరు. ఆయన ఎంచుకున్న దాన్నుంచి ఎవ్వరూ ఆయన్ని కదపలేరు. ఇప్పుడిక స్తిమితపడి, ఇంతవరకు తనకు చెప్పినదాన్నీ, చెప్పబోయేదాన్నీ ఉత్సాహంగా అనుసరిస్తాడు.

మనం ఎవరితోనైనా మనల్ని ఐక్యం చేసుకున్నప్పుడు అది వారంటే మనకుండే ప్రేమను సూచిస్తుందా? లేదా, ఆ తాదాత్మ్యం చెందడం వట్టి ప్రయోగమేనా? అసలు ఐక్యభావన వల్ల ప్రేమ, ప్రయోగం అంతం కావా? ఐక్యం చేసుకోవడం అంటే సొంతం చేసుకోవటం, తనకు చెందినదని ఉద్ఘాటించటం. ఏదైనా సొంతమైనప్పుడు ప్రేమ పోతుంది. పోదా? సొంతం చేసుకోవటం అంటే సురక్షితంగా ఉండటం, సొంతం చేసుకోవటం అంటే