పుట:Mana-Jeevithalu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

45. నగరంలో జీవితం

ఆ గది అన్ని విధాలా వీలుగా, ప్రశాంతంగా, హాయిగా ఉంది. గదిలో సామాను నాజూకుగా ఎంతో మంచి అభిరుచితో ఉంది. తివాసీ ఒత్తుగా మెత్తగా ఉంది. చలువరాతి గట్టుక్రింద నిప్పుచేసుకునే స్థలం - అందులో నిప్పులున్నాయి. ప్రపంచంలో అనేక ప్రదేశాల నుంచి తెచ్చిన పాత పూలకూజాలు ఉన్నాయి. గోడలమీద కొన్ని కొత్త చిత్రాలూ, కొన్ని పురాతన కళాకారుల చిత్రాలూ ఉన్నాయి. అ గది అందంగా సౌకర్యంగా ఉండటానికి ఎంతో ఆలోచించి జాగ్రత్త తీసుకున్నట్లుగా ఉంది. దానిలో వారి డబ్బూ, అభిరుచీ ప్రతిబింబిస్తోంది. ఆ గదిలోంచి చూస్తే చిన్నతోట, ఆ తోటలో పచ్చని మైదానం కనిపిస్తాయి. ఎన్నో సంవత్సరాలనుంచీ గడ్డి కత్తిరించబడి, పరిచినట్లుగా ఉంది.

నగరంలో జీవితానికీ జగత్తుకీ బంధం తెగిపోతుంది చిత్రంగా. లోయలూ, కొండలూ ఉండే స్థలాల్లో మనుషులు కట్టిన మేడలు, ఉరకలు వేసే జలధారల స్థానంలో వచ్చేపోయే వాహనాల రొద, రాత్రి నక్షత్రాలు కనిపించటం అరుదు. ఒకేళ ఎవరైనా చూడాలనుకున్నా నగర దీపాలు మరీ కాంతివంతంగా ఉంటాయి. నగరవాసులకేదో అవుతుంది నిశ్చయంగా. నాజూగ్గా మర్యాదగా ఉంటారు. వాళ్లకి చర్చిలూ, మ్యూజియమ్‌లూ, త్రాగుడూ, నాటకాలూ, అందమైన బట్టలూ, అంతులేని దుకాణాలూ ఉంటాయి. ఎక్కడ చూసినా మనుషులు - వీధుల్లో భవనాల్లో, గదుల్లో. ఆకాశంలో ఒక మేఘం వెడుతుంది. దానివైపు ఎవరో గాని కన్నెత్తి చూడరు. హడావిడి, కల్లోలం.

కాని, ఈ గదిలో అంతా నిశ్శబ్దంగా గంభీరంగా ఉంది. ధనవంతుల వద్ద ఉండే చిత్రమైన వాతావరణం ఉంది - అన్నిటికి దూరంగా, సురక్షితంగా, ధీమాగా, దేనికీ కొరత లేకుండా స్వేచ్ఛగా ఉంటుంది. ఆయనకి వేదాంతంలో ఆసక్తి ఉందని చెప్పుకొస్తున్నాడాయన - పూర్వ పశ్చిమ సిద్ధాంతాలు రెండింటిలోనూ ఆసక్తి ఉందట. గ్రీకు దేశస్థులతోనే ప్రారంభమైందనటం ఎంత ఆసందర్భం - అక్కడికి, వాళ్లకి ముందు ఇంకేమీ లేనట్లు - అన్నాడాయన. అంతలోనే తన సమస్య గురించి చెప్పటం మొదలుపెట్టాడు.