పుట:Mana-Jeevithalu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

గతం లేకుండా. అపార నిశ్శబ్దంలో జీవితం కొత్తగా ఉంది.

గదిలో ఒక మనిషి ఎదురు చూస్తున్నాడు - ఏవో మాట్లాడాలనే ఆదుర్దాతో. ఆయన ఒక రకంగా తీక్షణంగా ఉన్నాడు. కాని శాంతంగా కూర్చున్నాడు. పట్నవాసస్థుడని స్పష్టంగా తెలుస్తోంది. ఆ చిన్న పల్లెటూరులో ఆ గదిలో అందమైన నలగని దుస్తుల్లో ఉన్న ఆయన అదోలా ఉన్నాడు. ఆయన తన కార్యకలాపాల గురించీ తన ఉద్యోగంలో ఉన్న కష్టాల గురించీ, కుటుంబ జీవితంలో ఉన్న చిన్న గొడవలగురించీ, తన కోరికల తీవ్రత గురించీ చెప్పుకొచ్చాడు. ఈ సమస్యలన్నిటినీ తెలివిగా అందరిలాగే ఎదుర్కోగలిగాడు. ఆయన్ని నిజంగా చికాకు పరుస్తున్నవి లైంగిక వాంఛలు. ఆయనకి వివాహమైంది. పిల్లలున్నారు. అవన్నీ కాక, ఆయన లైంగిక కార్యకలాపాలు ఆయనకి తీవ్రసమస్య అయిపోయి, ఆయనకి పిచ్చెత్తిపోయేట్లు చేస్తున్నాయిట. కొంతమంది డాక్టర్లనీ, మనస్తత్వ విశ్లేషకులనీ సంప్రదించాడుట. కాని ఆ సమస్య ఇంకా అలాగే ఉందిట. ఇప్పుడు ఎలాగైనా దాని లోతుపాతులు తెలుసుకోవాలిట.

మన సమస్యల్ని పరిష్కరించుకోవటానికి మనం ఎంత ఆత్రుత పడతాం! ఏదో సమాధానం, ఏదో మార్గం, ఏదో మందుకోసం. సమస్యని యథాతథంగా పరిశీలించం. కాని ఉద్రిక్తతతో, ఆదుర్దాతో ఏదో పరిష్కారం కోసం వెతుకుతాం. ఆ వెతికేది తప్పని సరిగా స్వయం కల్పితమైనదే. సమస్య తాను స్వయంగా సృష్టించుకున్నదే అయినా, పరిష్కారాన్ని మాత్రం ఎక్కడో దానికి దూరంగా వెతుకుతాం. పరిష్కారం కోసం చూడటమంటే తప్పించుకోవటమే. అదే మనలో చాలామంది చెయ్యాలనుకునేది. అప్పుడు పరిష్కారం అత్యంత ముఖ్యమైపోతుంది - సమస్య కాదు. పరిష్కారం సమస్యకి విడిగా లేదు. పరిష్కారం సమస్యలోనే ఉంది - దానికి దూరంగా కాదు. పరిష్కారం అసలు సమస్యతో సంబంధం లేకుండా వేరుగా ఉంటే, మనం వేరే సమస్యలు సృష్టిస్తాం - సమస్యకి పరిష్కారాన్నెలా కనుక్కోవటం, ఎలా ఆచరించటం, ఎలా అమలుపరచటం మొదలైనవి. పరిష్కారం కోసం వెతకటం సమస్యని తప్పించుకోవటం కాబట్టి స్వయం కల్పితమైన ఆదర్శాల్లో, నమ్మకాల్లో, అనుభవాల్లో మునిగిపోతాం. ఈ స్వయంకృత రూపాల్నే ఆరాధిస్తూ