పుట:Mana-Jeevithalu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎరుక

121

అంతకంతకు మరీ అయోమయంగా అలసటగా అయిపోతాం. ఏదో ఒక నిర్ణయానికి రావటం కొంత సులభమే. కాని సమస్యని అర్ధ చేసుకోవటం శ్రమతో కూడినది. దానికి వేరే పద్ధతి ఉండాలి. ఆ పద్ధతిలో పరిష్కారం కావాలనే కోరిక మెదుల్తూ ఉండకూడదు.

సమస్యని అర్ధం చేసుకోవటానికి పరిష్కారం కావాలనే కోరిక నుంచి విముక్తి పొందటం అవసరం. ఈ విముక్తి పొందటం వల్ల పూర్తిగా ధ్యానం ఏర్పడటానికి వీలవుతుంది. వేరే ఇతర విషయాలవైపు మనస్సు మరలకుండా ఉంటుంది. సమస్యకి అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని సంఘర్షణ ఉన్నంత కాలం దాన్ని అవగాహన చేసుకోవటం జరగదు - ఈ సంఘర్షణే ధ్యానాన్ని మరోవైపుకి మళ్లిస్తుంది కనుక. సన్నిహిత సంపర్కం ఉన్నప్పుడే అవగాహన కలుగుతుంది. ప్రతిఘటన, వ్యతిరేకత, భయం, లేదా, అంగీకారం ఉన్నంతకాలం సన్నిహిత సంపర్కం ఏర్పడటం అసాధ్యం. సమస్యతో సరియైన సంబంధం ఏర్పరచుకోవాలి. అదే అవగాహనకి ఆరంభం. అయితే, సరియైన సంబంధం ఎలా ఉంటుంది, మీరు దాన్ని ఎలా వదిలించుకోవాలా అని బాధపడుతున్నప్పుడు - అంటే, దానికో పరిష్కారాన్ని వెతకాలనుకుంటున్నప్పుడు? సరియైన సంబంధం అంటే సన్నిహిత సంపర్కం. వ్యక్తంగా గాని అవ్యక్తంగా గాని ప్రతిఘటన ఉన్నప్పుడు సన్నిహిత సంపర్కం ఏర్పడటానికి వీలుండదు. సమస్య కన్న ఆ సమస్యని ఎలా సమీపిస్తున్నారన్నది ఎక్కువ ముఖ్యం. సమీపించే మార్గమే సమస్యనీ దాని అంతాన్నీ రూపొందిస్తుంది. సాధనం, లక్ష్యం, సమీపించే మార్గం వేరు కావు. సమీపించే మార్గమే సమస్య గతిని నిర్ణయిస్తుంది. సమస్యని ఎలా పరికిస్తున్నారన్నది అత్యంత ముఖ్యం. ఎందువల్లనంటే, మీ ప్రవృత్తి, మీ అయిష్టతలూ, భయాలూ, ఆశలూ దాని రంగుని మారుస్తాయి కనుక. సమస్యని సమీపించే పద్ధతిని ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా తెలుసు కోవటం వల్ల సమస్యతో సరియైన సంబంధం ఏర్పడుతుంది. సమస్య స్వయంకృతం. అందుచేత స్వీయజ్ఞానం ఉండాలి. మీరూ, సమస్యా ఒక్కటే, వేరువేరు కాదు. మీరే మీ సమస్య.

'నేను' యొక్క కార్యకలాపాలు భయంకరంగా చికాకుపెడతాయి.