పుట:Mana-Jeevithalu.pdf/128

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
119
ఎరుక

సముద్రం మీద వెళ్లటానికి సిద్ధపడాలి. ఆ అపరిచిత సముద్రం మీరే. మిమ్మల్ని మీరే తెలుసుకోవటానికి సిద్ధపడాలి కాని, ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం కాదు - అలాంటప్పుడు తెలుసుకోవటం కుదరదు కనుక. తెలుసుకోవడం అనేదానివలన ఆనందం కలుగుతుంది - స్మృతిని మననం చేసుకున్నప్పుడూ, పోల్చిచూచినప్పుడూ కలిగే ఆనందం కాదది. ఇది నిత్య నూతనమైన ఆనందం ఆత్మజ్ఞానంతో వివేకం ఆరంభమవుతుంది. దాని ప్రశాంతతలో, నీరవతలో అప్రమేయమైనది, అంటే కొలతలకు అందనిది ఉంటుంది.


41. ఎరుక

మేఘాలూ విస్తారంగా ఉన్నాయి ఎగిసిపడే తెల్లని కెరటాల్లాగ. ఆకాశం నిర్మలంగా నీలంగా ఉంది. దానికి ఎన్నో వేల అడుగుల క్రింద మేము నిలబడిన చోట నీలంగా వంపు తిరిగి ఉన్న సముద్రం ఉంది. దూరాన భూభాగం ఉంది. ఆ సాయంకాలం రమణీయంగా ఉంది - ప్రశాంతంగా, స్వేచ్ఛగా. దూరాన ఆకాశంలో నౌక పొగ కనిపిస్తోంది. నారింజ తోటలు కొండదిగువున పొడుగుతా ఉన్నాయి. వాటి పరిమళం గాలి నిండా ఉంది. సాయంకాలం నీలిరంగుకి మారుతోంది ఎప్పుడూలాగే. గాలికూడా నీలంగా అయినట్లుంది. ఆ లేతరంగులో తెల్లటి ఇళ్లు వెలవెల బోతున్నాయి. సముద్రపు నీలిరంగు ఒలికి నేలంతా పరుచుకున్నట్లుగా ఉంది. పైనున్న పర్వతాలు కూడ లేతనీలంరంగులో ఉన్నాయి. ఆకర్షణీయమైన దృశ్యం అది. అపారమైన నిశ్శబ్దం. సాయంకాలపు చప్పుళ్లేవో కొద్దిగా ఉన్నప్పటికీ, అవి కూడా నిశబ్దంలో భాగమైపోయాయి మేమూ అయినట్లుగానే. ఈ నిశ్శబ్దం ప్రతిదాన్నీ సరికొత్తగా చేస్తోంది - యుగాల తరబడి పేరుకున్న మురికిని, అన్ని గుండెల్లోని బాధనీ తుడిచిపెట్టేస్తూ. కన్నులు ప్రక్షాళితమైనాయి. మనస్సు ఆ నిశ్శబ్దంలో చేరింది. గాడిద ఒకటి ఓండ్ర పెట్టింది. దాని ప్రతిధ్వనులతో లోయంతా నిండింది. నిశ్శబ్దం వాటిని స్వీకరించింది. రోజు పూర్తి కావడంతో గతదినాలన్నీ మరణిస్తాయి. ఈ మరణంలోనే పునర్జన్మ ఉంటుంది - దుఃఖపూరితమైన