పుట:Mana-Jeevithalu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అహంకారులైన ముగ్గురు ధర్మపరాయణులు.

3

అటువంటి పనికి ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే, వాళ్ళని పక్కకి తొలగించి వెయ్యాలి, మర్యాదగానే అనుకోండి; ఆ పనిని నిర్వహించటం అత్యంత ముఖ్యం, దాన్ని ఆపటానికి వీల్లేదుట. "ఇతరులకు వేరే మార్గాలుండవచ్చు, కాని మేము చేసేపని అత్యవసర మైనది. దానికి అడ్డు తగిలే వాళ్ళెవరూ మాతో ఉండడానికి వీలులేదు," అన్నాడాయన.

ఆదర్శ సమాజవాది మొదటి ఆదర్శవాదికీ, రెండవ వ్యవహార పరుడికీ మధ్యరకం. ఆయనకి పాత బైబిల్ అంటే కిట్టదుట. కొత్తదంటేనే ఇష్టంట. ఆయనకి కొత్తదాంట్లోనే అచంచల విశ్వాసం. ముందు ఏమి రానున్నదో ఆయనకు తెలుసుట. కొత్త బైబిల్‌లో ముందు ఏమి జరుగనున్నదో అంతా రాసి ఉందట. ఆయన పథకం ఏమిటంటే, అంతా గందరగోళం చేసేసి, మళ్ళీ అన్నీ సరిగా సమకూర్చి కొత్తగా కొనసాగించటం. ప్రస్తుతం ఉన్నదంతా అవినీతే. దీన్ని సర్వనాశనం చేశాక, ఆ వినాశం నుంచి నూతన నిర్మాణం జరుగుతుందిట. భవిష్యత్తు కోసం ప్రస్తుతాన్ని త్యాగం చెయ్యవలసి ఉందిట. భావి మానవుడు అత్యంత ముఖ్యంగాని ఈనాటి మనిషి కాదుట. ఆ భావి మానవుణ్ణి ఎలా సృష్టించాలో నాకు తెలుసును" అన్నాడాయన. "అతడి మనస్సునీ, హృదయాన్నీ ఎలా మలచాలో మాకు తెలుసును. కాని, ఏదైనా మంచి చేయాలంటే అధికారంలో ఉండాలి. ఆ నూతనస్థితిని తీసుకు రావటానికి మాతో బాటు ఇతరుల్ని కూడా త్యాగం చేస్తాం. ఎవరు అడ్డొచ్చినా చంపేస్తాం. మనం అనుసరించే మార్గం ముఖ్యం కాదు, లక్ష్యమే ప్రధానం".

చివరికి లభించే శాంతి కోసం ఎటువంటి హింసనయినా తలపెట్ట వచ్చునట. చివరికి లభించే వ్యక్తి స్వాతంత్ర్యం కోసం ప్రస్తుతం రాక్షసకృత్యాలు అనివార్యమట. "మా చేతుల్లోకి అధికారం వచ్చినప్పుడు ఈ వర్గవిభేధాలూ, మతబోధకులూ లేని నూతన ప్రపంచాన్ని రూపొందించటానికి అన్ని రకాల ఒత్తిడులూ తెస్తాం. మా ముఖ్య సిద్దాంతాన్ని మేము వదలం. సిద్ధాంతం మీద మేము స్థిరంగా నిలిచి, పరిస్థితులకనుగుణంగా మా వ్యూహాలూ, ఎత్తు గడలూ మారుస్తూ ఉంటాం. భావి మానవుడి కోసమై నేటి మనిషిని నాశనం చేయటానికి మేము పథకం తయారుచేసి, కార్యరంగంలోకి దూకుతా"మని ఉద్ఘాటించాడాయన.