పుట:Mana-Jeevithalu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

భవిష్యత్తుకి సోపానం వంటిది మాత్రమేనట. ఈనాటిలో ఉన్న ఆసక్తి రేపటి వల్లనేట.

రేపు అనేది లేకపోతే ఈ ప్రయాస అంతా దేనికి అని అడిగాడాయన. లేకపోతే పనిపాటల్లేకుండా ఎద్దుమొద్దు స్వరూపంలా ఉండిపోవచ్చునట.

జీవితమంతా గతం నుంచి ప్రస్తుతం ద్వారా భావిలోనికి కొనసాగించే ప్రయాణమేనట. భవిష్యత్తులో ఏదో అవటానికి ప్రస్తుతాన్ని వినియోగించుకోవాలన్నాడాయన. వివేకం కలిగి ఉండటం, శక్తి పొందటం, కారుణ్యం చూపించటం అందుకేనట. ప్రస్తుతం, భావీ కూడా అశాశ్వతాలే, కాని, ఫలితం లభించేది రేపే. ఇవాళ అనేది దాటవలసిన ఒక మెట్టు మాత్రమేననీ, దాన్ని గురించి అంతగా కంగారు పడకూడదనీ అన్నాడాయన. రేపటి ఆదర్శాన్ని స్పష్టంగా పెట్టుకొని దాన్ని విజయవంతంగా చేరుకోవటానికి ప్రయాణం సాగించాలని చెబుతూ, ప్రస్తుతం అంటే అసహనం కనబరిచాడాయన.

సౌభ్రాతృత్వాన్ని కోరే ఆయన మరింత పండితుడు. ఆయన మాట్లాడేభాష కవితా ధోరణిలో ఉంది. శబ్ద ప్రయోగంలో ప్రతిభాశాలి. మొత్తం మీద చమత్కారి. ఒప్పించగల సమర్ధుడు. ఆయన కూడా తన భవిష్యత్తులో ఒక దివ్య హర్మ్యాన్ని నిర్మించుకున్నాడు. ఏదో అవుతానను కుంటున్నాడు. ఈ భావంతో ఆయన హృదయం నిండి ఉంది. ఆ భవిష్యత్తు కోసం కొందరు శిష్యుల్ని పోగుచేశాడు. మరణం ఎంతో సుందరమైన దన్నాడు. ఎందువల్ల నంటే, అది తన దివ్యహర్మ్యం చేరువకి తీసుకుపోతుందట. ఆ ఆశతోనే ఈ దుఃఖమయమైన, అసహ్యకరమైన ప్రపంచంలో జీవించటం సాధ్యమవుతున్నదన్నాడు.

ఈ ప్రపంచాన్ని మార్చటానికి, సౌందర్యమయం చేయటానికీ ఆయన సిద్ధమే. మానవ సౌభ్రాతృత్వం కోసం ఉత్సుకతతో పని చేస్తున్నాడు. ఆయన ఉద్దేశంలో, ఈ ప్రపంచంలో ఏ పని కావాలనుకున్నా వృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష తప్పనిసరిగా ఉండాలిట; దానితో బాటు హింసాత్మక చర్యలూ, అక్రమప్రవర్తనా ఉన్నప్పటికీ ఆకాంక్ష ఉండి తీరాలిట. ఏవైనా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే కొంచెం కఠినంగా ఉండవలసి వస్తుందిట. మానవాళికి ఉపయోగకరమైన పని చేయటం చాలాముఖ్యం.