పుట:MaharshulaCharitraluVol6.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరణ్యకమహర్షి

3


ఇంత మహాభక్తుడవు నీ కెట్లు రామనామము లభించెనో తెలుపు " మని వేడుకొనెను.

శత్రుఘ్నకుమారా ! చెప్పెదను. వినుము. " నేను బాల్యము నుండియు దత్త్వజ్ఞానమును సంపాదింప గోరి లెక్కలేనన్ని తీర్థములకు దిరిగితిని. ఎక్కడను ఒక్కడును నాకు జ్ఞాన ముపదేశింప లేడయ్యెను. ఇట్లుండ నా పూర్వపుణ్యమున లోమశమహర్షి దేవలోకము నుండి వచ్చుచు నా కంట బడెను. నే నాతని నెరిగి పాదముల కెరగి " మహాత్మా ! సంసారసాగరమును దరించు నుపాయమును జెప్పి యనుగ్రహింపు " మని ప్రార్థించితిని. దాని కాతడు " వత్సా ? మార్గము లనేకము లున్నవి. కాని, రామమంత్రముకంటె సంసారమునుండి దాటించు మంత్ర మింకొకటి లేదు. ఇది వేదశాస్త్ర పరమ రహస్యము. ఇంతకంటె వేరు వ్రతములు, క్రతువులు, యోగము, యాగము, దానము, మౌనము లేవు. రామస్మరణమున చండాలుడైనను ముక్తిపొందునన్న వేదశాస్త్రవివేకము గల బ్రాహ్మణునిగూర్చి చెప్పనేల ? నీవు నన్నతి విధేయత నడిగితివి గాన జెప్పితిని. నీ వీ పరమరహస్యమును నాస్తికులకు, శ్రద్ధాహీనులకు, భక్తిహీనులకు, కామక్రోధాదిదూషితులకు, భక్తనిందకులకు, శాంతిరహితులకు, దురహంకారులకు నెన్నడును జెప్పకుము." అని పలికెను.

నే నపరిమానంద మంది యాతని పాదపద్మములను విడువక " తండ్రీ ! నాకు రామధ్యానపద్ధతి దెలిపి కరుణింపు " మని వేడితిని. అంత గరుణారసము వెల్లివిరియ నా మహామహు డిట్లు చెప్పదొడగెను.

లోమశమహర్షి ప్రబోధము

అయోధ్యలో జిత్రమండపముతో నొప్పు కల్పవృక్షము మూలమున నవరత్నస్థగిత మగు బంగారుసింహాసనమున గూర్చుండి పూర్ణచంద్రుని బోలు ముఖపద్మముతోడను, దూర్వాదళ శ్యామ మగు దేహము తోడను, మణికిరీటముతోడను, నీలకుంతలములు, మకర కుండలములు, వైదూర్యమణులవంటి పలువరుసలు, పూవువంటి నాలుక, శంఖమువంటి