Jump to content

పుట:MaharshulaCharitraluVol6.djvu/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

మహర్షుల చరిత్రలు


శ్వము ఆరణ్యకమహర్షి యాశ్రమ ప్రాంతమునకు వచ్చెను. దాని వెన్నంటి వచ్చు శత్రుఘ్నుడును ఆరణ్యకమహర్షి యాశ్రమోపాంతమునకు వచ్చి, యది యారణ్యకమహర్షి యాశ్రమ మని యెఱింగి పాదచారియై తగువారుమాత్రమే కూడ రాగా, ఆరణ్యకుని దర్శించి స్వనామ గోత్రములు చెప్పుకొని మహర్షికి సాష్టాంగ నమస్కార మొనరించెను.

ఆనందపారవశ్యము

ఆరణ్యకమహర్షి యపరిమితానందమున నాతని కర్ఘ్యపాద్యాదు లొసగి యాదరించి క్షేమ మడిగి వచ్చినపని యడిగెను. శత్రుఘ్నుడన్న శ్రీరాముడు చేయు నశ్వమేధయాగము సంగతి దెలిపి యశ్వ మా ప్రాంతమునకు వచ్చుటచే దానును వచ్చుటయు ఋషిసందర్శనాశీర్వచ్న కుతూహలమున బాదచారియై వచ్చి ప్రణమిల్లుటయు జెప్పెను. శత్రుఘ్నుడు పలికిన రామనామమును విన్నంతనే యానందబాష్పములు ప్రవాహములై కన్నుల వెంట బ్రవహింప దేహమును మరచి, కన్నులు ముసి మ్రోడువలె గదలిక లేక ఆరణ్యక మహర్షి శత్రుఘ్నాదుల కాశ్చర్యభయ సంభ్రమములు గల్గించెను. కొంతకాల మట్లు సమాధి నిమీలితాక్షుడైన మహర్షి పిదప దెలివంది కన్నులు తెరచి గద్గదస్వరమున రామనామశ్రవణము, రామసోదరదర్శనము, రామస్మరణసమాధి కలిగినందుల కానందించి

" అల్పపుణ్యప్రదంబు లైనట్టియాగ
ములును యోగంబులును వ్రతంబులును సరియె ?
తెగని సంసారబంధంబు త్రెంచివైచి
క్షేమ మొనగూర్చు శ్రీరామనామమునకు."

అని పల్కెను.

ఆరణ్యకుని ఆత్మకథ

అంత శత్రుఘ్నుడు "మహాత్మా ! నేను రామసోదరుడనై యున్నను నీ వందిన యానందములో వందవవంతైన నందలేనైతిని.