పుట:MaharshulaCharitraluVol6.djvu/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

మహర్షుల చరిత్రలు


చేటు తామే తెచ్చుకొన్నవా రగుదురు. కొలువులో రాజుముఖముననే దృష్టినిలిపి యాతని చూపులు చేష్టలు గ్రహింపవలయును. రాజగృహమందలి వార్తలు పైని వినిపింపరాదు. అంతఃపురస్నేహ మెంతవారి కై నఁ బ్రమాద హేతువు. అంతకన్నఁ బ్రమాద హేతువు అందలి కుబ్జ వామన కాంతాదుల పొందు. ఉత్తమాసన వాహనాదులు రా జీయనిదే రాజసేవకులు తమంత దాము గ్రహింపరాదు. రాజు మన్నన నుబ్బక అవమానమునకు స్రుక్కక మెలఁగిన శుభము అందుదురు.

ఆవులింత, తుమ్ము, నవ్వు, ఉమియుట ఇవి బహిరంగముగాఁ గాక గుప్తములుగా నొనరింపవలయును. వైరుల దూతలతో మనసిచ్చి మాటాడరాదు. రాజునకు సంబంధించిన యేనుఁగుతోఁ గాని దోమతోఁ గాని వైరము వలదు. తా మెంత బలవంతులై నను రాజు సేవకులకు జనులపొందు మేలు. కలిమికి భోగము ఫల మనుకొని విచ్చలవిడి భోగింపక తనకెంత యున్నను అడఁకువతో భోగము లనుభవింప వలయును.”

ఇట్లెన్నియో సేవాధర్మములు ధౌమ్యుఁడు వినిపింప విని పాండవులు:

“తల్లియుఁ దండ్రియు దైవము
 నెల్ల సుహృజ్జనము మీర యిట్లు గొలిచి వ
 ర్తిల్లెడు తెఱంగు లెంతయుఁ
 దెల్లము చేసితిరి బ్రదికితిమి మీకరుణన్.”
                               భార. విరా. 1. 142

అని కృతజ్ఞతఁ దెలిపిరి. ధౌమ్యుఁడు జాగ్రత్త యని వారిని హెచ్చరించి అజ్ఞాతవాస నిర్విఘ్నపరిసమాప్తికి హృదయ పూర్వకముగా నాశీర్వదించెను.

పాండవులు ధౌమ్యుని వీడ్కొనుట

పిదప ధౌమ్యుఁడు శ్రద్ధతో పాండవుల ప్రయాణ సమయ మంగళార్థము లగుమంత్రములు జపించుచు నగ్నిని ప్రజ్వలింపఁ జేసి కామ్య