పుట:MaharshulaCharitraluVol6.djvu/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధౌమ్యమహర్షి

45

ధౌమ్యునిమాటలకు ధర్మజుని మనస్సు నందలి కలంక దీఱెను. అపుడు భూసురు లంద ఱొక్కస్వరమున “మీకు దైవమనుకూలించుఁ గాక ” యని పాండవుల నాశీర్వదించి ధర్మజుచే ననుజ్ఞాతులై తమతమ యగ్నిహోత్రములం గైకొని పునర్దర్శనమగుఁ గాక యని తమ తమ కోరిన చోటుల కేఁగిరి.

ధౌమ్యుఁడు పాండవులకు సేవాధర్మము లెఱింగించుట

ఆ తరువాతఁ బాండవు లైదుగురు ద్రౌపది విరాటరాజు పాలి కేగి తాము మెలఁగెడు తెఱఁగుల నేర్పఱుచుకొని కార్యనిర్ణయము చేసికొనిరి. పిదవ ధర్మజుఁడు అగ్నిహోత్రములం గాపాడ ధౌమ్యుని, ద్రుపదు పురమునకుఁ బోయి నిలచునట్లు కొందఱను, ద్వారకానగరమున కేఁగి యుండునట్లు ఇంద్రసేనాదులను, నియోగించి వారెవ్వరినై న నెవ్వరైనఁ బాండవు లేమై రని యడిగిన ద్వైతవనమున మమ్ము విడిచిపోయిరి. తరువాత నేమైరో మే మెఱుఁగ” మని చెప్పుఁ డని కోరి యభ్యంతర పరివారము నెల్లఁ బంపివేసెను. అపుడు ధౌమ్యుఁడు పాండవుల కిట్లనెను. “మీ శుభము కోరినవాఁడ నగుట మీ రెఱిఁగిన వారైనను మీకుఁ గొన్ని విషయములు చెప్పెదను. మీ రొరులను గొలిచి యెఱుఁగరు. కావున, మీ ప్రవర్తనలో నేదైన తొందరవచ్చిన ముందు కార్యగతి తప్పును. కావున మీకు సేవాధర్మములను సంక్షేపముగాఁ జెప్పెదను. సావధాన మనస్కులై యాలకింపుఁడు.

రాజగృహము చొచ్చి యుచితమైన స్థానమున వికారరహిత వేషమునఁ గూర్చుండవలయును. సమయ మెఱిఁగి రాజును సేవింపవలయును. రాజాభిమానము పొంది “నాకే ' మని గర్వపడి మరియాద తప్పిన పురుషార్థమునకు హాని కలుగును. రాజగృహముకంటె నందముగా నిల్లుగట్టుట కాని రాజు చేసిన పనులు చేయుట కాని యాతని విహారముల ననుకరించుట కాని తగదు. రాజు లలిగినచో పుత్ర పౌత్ర భ్రాతృ మిత్రు లనుభేదముఁ జూపరు. పూర్వపు మంచి చూడరు. రాజు మనసు చూరగొంటిమి కదాయని పలువురకు సంకటము కలుగు పను లేమి చేసినను ప్రాజ్ఞులు సంతసింపరు. అట్టివారు తప్పక తమ