పుట:MaharshulaCharitraluVol6.djvu/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధౌమ్యమహర్షి

43


సామగానములు చేయుచు ధౌమ్యమహర్షి వెడలెను. ధౌమ్యునితో పాటు వేలకొలఁది యుత్తమబ్రాహ్మణు లగ్ని హోత్రములఁ గైకొని యధర్మ పరుఁడగు దుర్యోధనుని రాజ్యమున నుండ నిచ్చగింపక పాండవుల ననుసరించిరి. అరణ్యమున వీరినందఱ నెట్లు పోషించుట యని ధర్మరాజు దుఃఖింప శౌనకమహర్షి యాతని నోదార్పెను. పిదపఁ దమ్ములతో ధర్మజుఁడు ధౌమ్యుని చరణముల వ్రాలి “మహాత్మా! రాజ్యమంతయుఁ గోల్పోయిననేను మహారణ్యమున బ్రాహ్మణప్రవరుల నెట్లు పోషింతు? ఉపాయముఁ జెప్పు” మని ప్రార్థించెను. ధౌమ్యుఁ డాలోచించి “ధర్మరాజా! మొదట భూతజాలములు పుట్టి యాఁకలితో బాధపడుచుండఁ జూచి సూర్యభగవానుఁడు దయకలిగి యుత్తరాయణ గతి నుర్వీరసము గైకొని దక్షిణాయనగతియై యోషధులఁ బడసి రాత్రులఁ జంద్రకిరణామృతమున వానిం దడుపుచు వర్ధిల్లఁజేసి యం దన్నము పుట్టించి ప్రజాప్రాణములను గాపాడఁ దొడఁగెను. ఇది యెఱిఁగి తొల్లిటిమహారాజులు యోగసమాధినిష్ఠులై యన్న మాదిత్య మయమని సూర్యుని భజించి యన్నముఁ బడసి ప్రజల నాపదలనుండి కాపాడిరి. కనుక, నీవును సూర్యోపాసన మొనరించి సూర్యానుగ్రహమున భూసురులఁ బోషింపు" మని యాతనికి సూర్యస్తోత్రము అష్టోత్తర శత నామ మంత్రము నుపదేశించెను.

ధౌమ్యుని యుపదేశము తలధరించి ధర్మజుఁడు పవిత్ర భాగీరథి జలస్నాతుఁడై పరమపూతుఁడై సూర్యు నారాధింప నాతఁడు ప్రత్యక్షమై పాండవు లరణ్యవాసము చేయు పండ్రెండేండ్లును వన్యఫలమూలములు ద్రౌపది వంటచేయ అక్షయములు అనంతవిధము లగుశాకపాకములు చతుర్విధాహారములు నగు నని వర మొసంగి యంతర్హితుఁ డయ్యెను. దాన ధర్మరాజు భూసురశ్రేణి కభిమతార్థము లొసంగుచు, భోజనమునఁ దృప్తిపొందించుచు సేవించుచు నుండెను.

తదనంతరము నారదుఁడు పాండవుల కడకు వచ్చి ధర్మరాజుం గాంచి ధౌమ్యానుమతమున రోమశమహర్షి చెప్పినట్లు తీర్థయాత్ర చేయుమని సూచించి వెడలెను. వెంటనే రోమశమహర్షి వచ్చి తా నింద్ర నియోగమునఁ బాండవులచేఁ దీర్థయాత్ర చేయింప వచ్చితి ననియుఁ