పుట:MaharshulaCharitraluVol6.djvu/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

మహర్షుల చరిత్రలు


చేయించెను. వెనువెంటనే యామె యీశ్వర వరప్రసాదమునఁ గన్యాత్వ దూషిత కాకుండఁ గౌమార దశ నందెను. అట్లామెను గ్రమముగా భీమార్జున నకులసహదేవులకును బాణిగ్రహణంబు చేయింవ సర్వజన సమ్మోదకరముగా దేవతల పుష్పవృష్టియు, భూదేవతల యాశీర్వృష్టియు, దేవదుందుభినాద దివ్యవృష్టియుఁ గురిసెను.

పిమ్మట ద్రౌపదీసహితులై పాండవులు ధౌమ్య పురస్సరులై హస్తినాపురమునకు వచ్చి ధృతరాష్ట్రుఁ డర్ధరాజ్య మీయ విశ్వకర్మ యింద్రప్రస్థపురము నిర్మించియొసంగ వానిని స్వీకరించి రాజ్యపాలనము చేయుచుండిరి. తరువాత, నియమ భంగ మొనరించిన .యర్జునుఁ డన్నల యనుమతిని ద్వాదశమాసికవ్రతము సలుపుచు తీర్థయాత్రలకుఁ బోయి ఉలూచి, చిత్రాంగదాదులఁ బాణిగ్రహణముచేసికొని ద్వారకాపురి కేఁగి కపటయతి వేషమున సుభద్ర పరిచర్యఁ బడసి కృష్ణు ననుమతి నామెఁ బరిణయమై వ్రతాంతమున నామెం దీసికొని యింద్రప్రస్థపురమునకు వచ్చి యామెయందు వంశకీర్తి కరుఁ డభిమన్యుఁ డనువీర పుత్రుం గాంచెను. ధౌమ్యమహర్షి యభిమన్యునికి జాతకర్మచౌలోప నయనాదు లొనరించి వేదవేదాంగములం దాతని నతిప్రవీణు నొనరించెను.

ధర్మరాజు నారద! పేరితుఁడై రాజసూయయాగమును జేయఁ దలపెట్టియు భయపడఁగా ధౌమ్యుఁ డాతని కభయ మొసఁగి శ్రీకృష్ణానుమతి రాజసూయ మొనర్పు మని ప్రేరేచెను. పిదప ధర్మరాజు అనంతవేదమూర్తులైన పైల ధౌమ్యులు హోతలుగా, యాజ్ఞవల్క్యుఁ డధ్వర్యుఁడుగా, కృష్ణద్వైపాయనుండు బ్రహ్మగా, సుసాముఁ డుద్గాతగా, వీరిపుత్రశిష్య గణములు మిగిలిన యాజ్ఞికులుగా, నారదాది బ్రహ్మర్షులు సదస్యులుగా, భీష్మాది రాజర్షులు సహాయులుగా, సర్వక్రియా సమగ్రముగా షడంగసమృద్ధిగా, సంపూర్ణ దక్షిణా సనాథముగా, సకలధనధాన్యసమన్వితముగా జగన్నాథ రక్షితముగా, సకలజనానందకరముగా రాజసూయ మొనర్చి జగద్విఖ్యాతి నార్జించెను.

అనంతరము కపటద్యూతమున ధర్మజుఁ డోడి సోదరులతోడను ద్రౌపదితోడను అరణ్య వాసమునకుఁ బోవ వారితోఁగూడ రౌద్రయామ్య