పుట:MaharshulaCharitraluVol6.djvu/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

మహర్షుల చరిత్రలు


దానును ధౌమ్యునితోఁ బాండవులకడ నుందుననియుఁ జెప్పెను. ధర్మజుఁ డానందించి తీర్థయాత్ర లారంభించెను.

ధౌమ్యుఁడు పాండవుల నోదార్చుట

పండ్రెండువత్సరము లరణ్యవాస మైనపిదప నొకయేఁడజ్ఞాత వాసము చేయవలసినసమయ మాసన్న మయ్యెను. అంతవఱకుఁ దనతో నగ్నిహోత్రములు తోడన కల్గి వర్తిల్లిన బ్రాహ్మణోత్తములఁ జూచి ధర్మజుఁ డిట్లనెను. "మహనీయులారా ! మీతో అరణ్యవాసము ననాయాసముగాఁ గడపితిమి. ఇఁక మిమ్ము విడిచి యజ్ఞాతవాసము చేయవలసియున్నది. అందు మేము విఘ్నములు కలుగకుండ బయట పడుటకు మీ యమోఘాశీర్వచన మత్యంతావశ్యకము. కావున మ మ్మట్లాశీర్వదించి యనుగ్రహించి సెలవొసంగుఁ" డని కోరి, విషణ్ణ హృదయుఁడై డగ్గుత్తికవెట్ట దౌమ్యమహర్షి ధర్మజుని కుత్పాహంబుఁ బుట్టింప నిట్లనెను.

"ధర్మనిరూపకత్వమున ధైర్యమునన్ మహనీయవృత్తి స
 త్కర్మ విధిజ్ఞతం జతురతామహిమన్ దృఢబుద్ధి నెవ్వరున్
 ధర్మజుపాటి గా రనఁగ ధాత్రిఁ బ్రసిద్ధుఁడవై న యట్టి నీ
 పేర్మికి నీడె దుర్దశల పెల్లునకున్ దురపిల్లు టారయన్ ?"
                                              భార, విరా. 1. 51.

"ధర్మజా! నీవే కాదు. దేవతలైన నొక్కొక్కప్పుడు శత్రువుల నోర్చుటకై తగినకాలమునకు వేచియుండ వలయును. నిషధ పర్వతమున దేవేంద్రు నంతటివాఁడు మాఱువేషమున మసలలేదా ! విష్ణుమూర్తి యంతటివాఁడు అదితి గర్భమున వామనాకారత నణఁగి యుండలేదా ? ఔర్వుఁడు తల్లి యూరు ప్రదేశమున నతి నిగూఢముగా డాఁగియుండ లేదా ? మార్తాండుఁడు గోశరీరవిలీనుఁడై యజ్ఞాతముగా నుండలేదా? వీరు కష్టముల కోర్చి తుదకు సుఖసంపద లంది సుఖించిరిగదా ! నీవు నట్లే యీ కష్టముల సహించి శుభము లందు” మని బోధించెను.