పుట:MaharshulaCharitraluVol6.djvu/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

మహర్షుల చరిత్రలు


లతో నన్నుఁ గలియుదురు. నీ తమ్ముఁ డగు ధౌమ్యుఁడు దేవగణ మునిగణమాననీయుఁడై హరిప్రియులగు పాండవులకు గురువై శ్రీకృష్ణ కటాక్షము నంది చెలువొందు" నని చెప్పి పరివారసమేతముగా నంతర్హితుఁ డయ్యెను.

పిదప ఉపమన్యువు మహర్షిశ్రేష్ఠుఁడు, పరమ విజ్ఞాని, బ్రహ్మభావసంపన్నుఁడు, సర్వజనపూజ్యుఁడై వెలుఁగొందెను. ధౌమ్యుఁ డన్నకడ సెలవుగై కొని పోయి భాగీరథిం దాఁటి యవ్వలియొడ్డునఁ గల “ ఉత్కచ " మను తీర్థమున కరిగి యాశ్రమమును నిర్మించుకొని పరమత పోజీవితమును గడపుచుండెను. *[1]

పాండవులు దౌమ్యుని బురోహితునిగా వరించుట.

అంగారవర్ణుఁడను గంధర్వరాజు అర్జునునిచే నోడి పాండవులతోఁ జెలిమి నెఱపి వారిక్షేమముఁ గోరి వేదవేదాంగ విశారదుఁడు, జపహోమయజ్ఞ ప్రశస్తుఁడు, సత్యవచనుఁడు. విప్రోత్తముఁడు చతుర్వర్గసాధకుఁడు, సదాచారుఁడు, సూరిజన స్తవనీయుఁడు నగునొకమహర్షిని బురోహితునింగా వరించి శుభంబులందుఁ డని సూచించెను. అగ్ని పరిగ్రహణము, బ్రాహ్మణ సంగ్రహము లేనియెడల నెంతటి మహారాజైన వంతలపాలు గాక తప్పఁ డనియు, అవి గలవాఁడు సర్వకష్టములను దాఁటి సుఖించి శుభముల నందునని యాతఁడు సోదాహరణముగాఁ జెప్పెను. అప్పు డర్జునుఁడు;

“మాకు నతి ప్రియుండవు సమ స్తవిదుండవు చెప్పుమయ్య యీ
 లోకములోని వర్తనములుం దగువారి నెఱుంగు దెవ్వనిం
 బ్రాకటధర్మతత్త్వవిదు బ్రాహ్మణముఖ్యు పురోహితుండుగాఁ
 జేకొను వార మట్టిబుధసేవితుఁగానఁగ మాకు నెందగున్ ?”
                                                   (భార . అది. 7. 156. )

అని ప్రార్థించెను. త్రికాలవేది యగు నంగారపర్ణుఁ డాలోచించి తత్సమీపమున 'ఉత్కచ ' మను తీర్థమునఁ దపముచేయు ధౌమ్యమహర్షి

  1. *భారతము ఆనుశాసనిక పర్వము.