పుట:MaharshulaCharitraluVol6.djvu/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదంక మహర్షి

17


డాతనితో " అయ్యా ! ఏమైనఁ గానిమ్ము. పాతాళమైన గీతాళమైనను, నే నేఁగి నా కుండలములు తెచ్చుకొని తీరెదను. లేదా ఆ ప్రయత్నమునఁ బ్రాణములైన వీడెదను. అంతేకాని నా ప్రయత్నము విరమింప" నని శపథము చేసెను. ఆ పలుకులు విని యింద్రుఁ డాతని దృఢనిష్ఠ కలరి నిజరూపముం జూపి యాతఁడు త్రవ్వు కొయ్యగోలకే వజ్రాయుధమునకుఁ గలుగు వాఁడిమియు శక్తియునిచ్చి కృతకృత్యుఁడ వగు మని యుదంకు నాశీర్వదించి వెడలిపోయెను.

ద్విగుణితనిష్ఠతో నుదంకుఁడు భూమిని ద్రవ్వుచుండఁగా భూదేవి భయపడిపోయి ఉదంకునకుఁ బాతాళలోకమునకుఁ దెరు విచ్చెను. ఉదంకుఁడు పాతాళలోకమున కేగి యనేక విధములగు ప్రాకారములచే నిండి, అనేకవిధముల రత్నముల కాంతులచే మిఱుమిట్లు గొలుపుచునున్న యా లోక మాలోకించి పది యోజనముల వెడల్పు పంచ యోజనముల విస్తారము నగు పాతాళ ద్వారమును గని యుదంకుఁడు తన కెట్లు కుండలాహరణము సాధ్య మగునో యని తెల్లఁబోయి చేయునదిలేక నాగవతుల నిట్ల ని స్తుతించెను.

“బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణసరస్సరస్వతీ
సహితమహామహీభర మజస్రసహస్రఫణాళిఁ దాల్చి దు
స్సహతరమూర్తికిన్ జలధిశాయికిఁ బాయక శయ్యయైన య
య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడిన్.

అరిది తపోవిభూతి నమరారులబాధలు పొందకుండఁగా
నురగుల నెల్లఁ గాచిన మహోరగనాయకుఁ డానమత్సురా
సురనుకుటాగ్రరత్న రుచిశోభితపాదున కద్రినందనే
శ్వరునకు భూషణం బయినవాసుకి మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.

దేవమనుష్యలోకములఁ ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సం
భావితశ క్తిశౌర్యులు నపారవిషోత్కటకోపవిస్ఫుర
త్పావకతాపితాఖిలవిపక్షులు నై నమహానుభావు లై
రాపతకోటిఘోరఫణిరాజులు మాకుఁ బ్రసన్ను లయ్యెడున్.