పుట:MaharshulaCharitraluVol6.djvu/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

మహర్షుల చరిత్రలు


కోరిక చెప్పక చెప్పుచున్నది. ఈమెతో మనకేల ? ” యని మునికుమారు రెల్లరు వచ్చిన త్రోవఁబట్టి పోయిరి. కాని, తండ్రివనువున వచ్చి శ్వేతకేతుఁడు దేవలుని సమీపించెను.

దేవలుఁడు శ్వేతకేతు నధికముగ నాదరించి సువర్బలం బిలిచి " అమ్మా ! ఈతఁ డుద్దాలకపుత్రుఁ డగుశ్వేతకేతువు. ప్రాజ్ఞుఁడు, విద్యా వినయవివేకనిధి, తపస్వి, ధర్మజ్ఞుఁడు. బ్రహ్మనిష్ఠుఁడు. ఈతఁడు నీకుఁ దగినపతి యని నాకుఁ దోఁచుచున్నది. తరువాత నీయిష్ట” మనెను. సువర్చల యాతనిపైఁ దీవ్రదృష్టి పాఱించెను. ఆమె మాటాడకుండఁ గనే శ్వేతకేతుఁడు " సుందరీ ! యెందుల కీ సందియము? నేను నీకొఱకే వచ్చితిని. నీవు నా దానవే. సందియ మందకుము. నేను లోకవాసనలఁ దగులక లోకవిషయముల నంధుఁడనై యున్నాను. కాని సంశయరహిత మగుజ్ఞాన చక్షువుఁ గలవాఁడ నగుటఁ బద్మపత్రములవలె నాకను లెంత విశాలములో తిలకింపుము. ఇందువదనా ! నీవు న న్నందుము. నిన్ను నా డెందమునకు హత్తుకొందును. మఱియు వినుము. జగమంతయు మిథ్య. ఇందు కనుట, వినుట, తాకుట, మూర్కొనుట, మాటాడుట, కర్మలు చేయుట, మనస్సుచే సంకల్పించుట, బుద్దిచే సత్యము నెఱుంగుట మున్నగు కార్యకలాప మంతయు మిథ్య యని యే జ్ఞాననేత్రమునకుఁ దెలియునో ఆ జ్ఞాననేత్రము లేనివాఁడు గ్రుడ్డివాఁడు. అది నాకుఁ గలదు, కనుక నేను గ్రుడ్డిని కాను. మఱి గ్రుడ్డిని! ఎట్లన, లోకులదృష్టిలో వారికివలె నేను వస్తువులఁ జూచుట లేదు. అనఁగా వారియజ్ఞానదృష్టి నాకు లేదు. కావున, వారి భావనలో నేను గ్రుడ్డివాఁడను. ఈ విధముగ నొకేక్షణమున నేను గ్రుడ్డివాఁడను, గ్రుడ్డివాఁడను గానివాఁడను. ఇంకన వినుము. లోకదృష్టిని నేను నిత్యనైమిత్తికకర్మ లాచరించుచునే యున్నాను. కాని, ఆత్మదృష్టిని నేను నిష్క్రియుఁడను. ఆ కర్మలఫలము న న్నంటదు. కార్య మగుప్రపంచమునఁ గారణ మగుపరమాత్మను నేనే యని యెఱింగినవాఁడ నగుట నేను బరమశాంతుఁడనై యున్నాను. మఱియు నేను గర్మాచరణమునను గర్మఫలత్యాగమునను మృత్యువును జయించి యమృతుఁడనై జ్ఞానప్రాప్త మగునాత్మానందమున మదమాత్సర్యకామ